స్పీకర్ ఫార్మాట్‌లో 13 మంది ఎంపీలు రాజీనామా! | Sakshi
Sakshi News home page

స్పీకర్ ఫార్మాట్‌లో 13 మంది ఎంపీలు రాజీనామా!

Published Wed, Oct 16 2013 2:29 AM

'Only 13 Parliament Members of Seemandhra resigned in Speaker Format'

కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన మొత్తం 13 మంది లోక్‌సభ సభ్యులు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పించారని లోక్‌సభ స్పీకర్ కార్యాలయం సోమవారం వెల్లడించింది. ఇందులో 10 మంది కాంగ్రెస్ ఎంపీలు, ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు, ఒక్క టీడీపీ ఎంపీ పేర్లు ఉన్నాయి. వీరిలో ఏడుగురు మాత్రమే ఇంతవరకూ స్పీకర్ మీరాకుమార్‌ను స్వయంగా కలిసి తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారని తెలిపింది. స్పీకర్‌ను కలవని ఆరుగురు ఎంపీలు స్వయంగా స్పీకర్ కార్యాలయానికి వచ్చి మీరాకుమార్‌ను కలిసి వెళ్లాల్సిందిగా కోరుతూ కార్యాలయ అధికారులు వారికి నోటీసులు పంపారు. 
 
 రాజీనామాలపై నిర్ణయం తీసుకోవటానికి ముందుగా ఎంపీలు స్వయంగా స్పీకర్ ఎదుట హాజరై రాజీనామాలకు కారణాలను వివరించాల్సి ఉంటుందని.. రాజీనామాలను ఆమోదించేందుకు సభ్యులు ఎలాంటి ఒత్తిళ్లకు, భావోద్వేగాలకు గురికాకుండా స్వచ్ఛందంగానే పార్లమెంటు సభ్యత్వాన్ని వదులుకోవాలని భావిస్తున్నట్లు స్పీకర్ సంతృప్తి చెందాల్సి ఉంటుందని ఒక బులెటిన్‌లో వివరించారు. లోక్‌సభ నియమ, నిబంధనల్లోని 101 (3) (బి) ప్రకారం స్పీకర్ తనకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకుని విచారించే అవకాశముందని పేర్కొన్నారు. కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు సమర్పించిన తర్వాత కూడా సభకు హాజరైనట్లు స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన నోట్‌లో పేర్కొన్నారు. 
 
రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించడంతో గత ఆగస్టు 2వ తేదీ తర్వాత రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఉండవల్లి అరుణకుమార్, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయి ప్రతాప్, జి.వి.హర్షకుమార్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాయపాటి సాంబశివరావు, కనుమూరి బాపిరాజు, సబ్బం హరి, ఎస్.పి.వై.రెడ్డి (ఇటీవల వైఎస్సార్‌సీపీలో చేరారు.), కొనకళ్ల నారాయణరావు (టీడీపీ), వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్) రాజీనామాలు సమర్పించారు. వీరిలో ఏడుగురు - ఉండవల్లి, లగ డపాటి, అనంత, సాయిప్రతాప్, సబ్బం హరి, రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి మాత్రమే గత నెలాఖరులో విడివిడిగా స్పీకర్‌ను స్వయంగా కలిశారు.
 
స్పీకర్ విచారణలో వీరిలో కొంతమంది రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజానీకంలో పెల్లుబుకిన ఆగ్రహావేశాల కారణంగా తాము నియోజకవర్గాలకు కూడా వెళ్లలేకపోతున్నామని, రాజీనామా చేయాల్సిందిగా తమపై ప్రజల నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నదని అంగీకరించిన ట్లు తెలిసింది. వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పీకర్‌ని కలిసినప్పుడు తన రాజీనామాను, తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి రాజీనామాను వెంటనే ఆమోదించాల్సిందిగా స్పీకర్‌ను కోరారు. షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నందున జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా రాలేకపోయారని, ఆయన తరఫున తాను ఆయన రాజీనామాను కూడా ఆమోదించాల్సిందిగా కోరుతున్నానని స్పష్టంచేశారు. 

 

Advertisement
Advertisement