శేషగిరిరావుకు క్లీన్‌చిట్ | NIMS cardiology department head of the government acquitted | Sakshi
Sakshi News home page

శేషగిరిరావుకు క్లీన్‌చిట్

Sep 13 2015 12:11 AM | Updated on Sep 3 2017 9:16 AM

శేషగిరిరావుకు క్లీన్‌చిట్

శేషగిరిరావుకు క్లీన్‌చిట్

నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ డి.శేషగిరిరావుకు రాష్ట్ర ప్రభుత్వం క్లీన్‌చిట్ ఇచ్చింది.

నిమ్స్ కార్డియాలజీ విభాగం అధిపతిని నిర్దోషిగా ప్రకటించిన సర్కారు
 
హైదరాబాద్: నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ డి.శేషగిరిరావుకు రాష్ట్ర ప్రభుత్వం క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్‌చందా ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య పరికరాల డీలర్ నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపిస్తూ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) రెండేళ్ల క్రితం శేషగిరిరావుపై కేసు నమోదు చేసింది. ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు పొందిన ఆయనను.. ఆరోపణలు సరైనవా కావా అన్నది విచారించకుండానే అరెస్టు చేసింది. 55 రోజుల పాటు బెయిల్ రాకుండా అడ్డుకుంది. అవినీతి కేసులో అరెస్టు కావడంతో2013 జనవరిలో ప్రభుత్వం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత అదే ఏడాది సస్పెన్షన్ ఎత్తివేసింది. ఏసీబీ తనపై తప్పుడు కేసు పెట్టిందంటూ శేషగిరిరావు ప్రభుత్వాన్ని ఆశ్రయిం చగా, మరోవైపు ఆయనను ప్రాసిక్యూట్ చేయాలంటూ ఏసీబీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే శేషగిరిరావు అభ్యర్థన మేరకు సర్కారు విజిలెన్స్ కమిషనర్ విచారణకు సిఫారసు చేసింది. సమగ్ర దర్యాప్తు జరిపిన విజిలెన్స్ కమిషనర్ ఆయనపై వచ్చిన ఆరోపణలు నిరూపితం కాలేదని తేల్చారు.

లంచం తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. అతనిపై వచ్చిన ఆరోపణలు రుజువు కానందున ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీంతో శేషగిరిరావును నిర్దోషిగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పథకం ప్రకారం శేషగిరిరావుపై కుట్ర పన్ని కేసులో ఇరికించే ప్రయత్నం చేయడాన్ని ఏసీబీ పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని వైద్యవర్గాలు తప్పుపడుతున్నాయి. ఇలాంటి చర్యలు ప్రతిష్టాత్మక వ్యక్తులు, వారి కుటుంబాల్లో చీకట్లు నింపుతాయని, మానసికంగా ఇబ్బందుల పాలు చేస్తాయని వారు మండిపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement