‘వణికి’స్తోంది | Sakshi
Sakshi News home page

‘వణికి’స్తోంది

Published Mon, Mar 21 2022 4:50 AM

There Are 5. 8 Lakh People With Parkinson Disease In Country - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్కిన్సన్స్‌ (వణుకుడు రోగం) వ్యాధికి కేంద్ర బిందువుగా భారత్‌ మారుతోందని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ న్యూరాలజీ విభాగం వైద్య బృందం తెలిపింది. ప్రస్తుతం దేశంలో ప్రతి లక్ష మందిలో 120 మంది ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నారని.. మొత్తంగా 5.8 లక్షల మంది పార్కిన్సన్స్‌తో బాధపడుతున్నారని చెప్పింది.

2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు తాము చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని నిమ్స్‌ ఆస్పత్రి వైద్య బృందం చెప్పింది. ఆదివారం నిమ్స్‌ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌లో పార్కిన్సన్స్‌ వ్యాధిపై వైజ్ఞానిక సదస్సు జరిగింది. పార్కిన్సన్స్‌ అధునాతన చికిత్సలో వాడే డి–మైన్‌ పంపులు, ఇంజక్షన్లను లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ హాస్పిటల్‌కు చెందిన మూవ్‌మెంట్‌ డిజార్డర్స్, పార్కిన్సన్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ మెట్టా ఆవిష్కరించారు.

ఆయన మాట్లాడుతూ.. పార్కిన్సన్స్‌ చికిత్సలో భాగంగా అపోమోర్ఫిన్‌ థెరపీ విధానంలో మందులు తీసుకునేప్పుడు ఉపశమనం ఉంటుంది కానీ కొద్దిరోజుల తర్వాత అవి సరిగా పని చేయట్లేదని చెప్పారు. ఫలితంగా రోగుల్లో వణుకు, పటుత్వం కోల్పోవడం, ఆందోళన చెందడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. ప్రస్తుతం అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. 

యువ జనాభాలోనూ సమస్య
నిమ్స్‌ హాస్పిటల్‌లో డి–మైన్‌ పంపులు, సిరంజ్‌ లు ఉపయోగించి చేసే అపోమోర్ఫిన్‌ చికిత్సా విధానాన్ని అందుబాటులోకి తెచ్చామని నిమ్స్‌ న్యూరాలజీ హెచ్‌వోడీ ప్రొఫెసర్‌ రూపమ్‌ బొర్గొహెయిన్‌ తెలిపారు. ఐరోపాలో బాగా వాడే ఈ థర్డ్‌ జనరేషన్‌ అపోమోర్ఫిన్‌–డెలివరీ పరికరాలు నిమ్స్‌తో పాటు నగరంలోని అన్ని ప్రఖ్యాత ఆస్పత్రుల్లో రోగులకు అందుబాటు లోకి వచ్చాయన్నారు.

రోగుల్లో ఎక్కువ మంది 50 ఏళ్లు పైబడిన వారే ఉన్నా యువ జనాభాలో నూ సమస్య పెరుగు తోందని అన్నారు. భవిష్యత్‌లో దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై పార్కిన్సన్స్‌ ప్రభావం చూపొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 30 మంది న్యూరాలజిస్ట్‌లు, మూవ్‌ మెంట్‌ డిజార్డర్స్‌ స్పెషలిస్టులు ఈ కొత్త తరహా డ్రగ్‌ డెలివరీ పరికరం వాడకంపై సందేహాలను నివృత్తి చేసుకున్నారని సెలెరా న్యూరో సైన్సెస్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బాబూ నారాయణన్‌ చెప్పారు. 

Advertisement
Advertisement