హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ 255/1
పాండిచ్చేరితో రంజీ మ్యాచ్
పుదుచ్చేరి: రాహుల్ సింగ్ (174 బంతుల్లో 114 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగడంతో... హైదరాబాద్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా పాండిచ్చేరితో శనివారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 70 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 255 పరుగులు చేసింది. రెగ్యులర్ కెప్టెన్ తిలక్ వర్మ ఆ్రస్టేలియాతో టి20 సిరీస్ ఆడేందుకు వెళ్లడంతో ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుకు రాహుల్ సింగ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.
ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయి ‘డ్రా’ చేసుకున్న హైదరాబాద్ జట్టు... ఈ పోరులో సాధికారికంగా ఆడింది. రాహుల్ అజేయ శతకంతో ఆకట్టుకోగా... కొడిమ్యాల హిమతేజ (137 బంతుల్లో 62 బ్యాటింగ్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో అతడికి అండగా నిలిచాడు. తన్మయ్ అగర్వాల్ (36), అభిరత్ రెడ్డి (35) ఫర్వాలేదనిపించారు. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తి ఓవర్లపాటు సాగలేదు. పాండిచ్చేరి బౌలర్లలో సాగర్ ఒక వికెట్ పడగొట్టాడు. రాహుల్, హిమతేజ క్రీజులో ఉన్నారు.
సత్తా చాటిన సాయితేజ విజయనగరం వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్‘ఎ’ మ్యాచ్‌లో ఆంధ్ర అరంగేట్ర బౌలర్ కావూరి సాయితేజ సత్తా చాటాడు. శనివారం ప్రారంభమైన పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బరోడా తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 79 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. విష్ణు సోలంకి (183 బంతుల్లో 99 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీకి అడుగు దూరంలో నిలిచాడు.
కెప్టెన్ అతీత్ సేథ్ (122 బంతుల్లో 65 బ్యాటింగ్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో రాణించాడు. శివాలిక్ శర్మ (3), శాశ్వత్ రావత్ (8), సుకీర్త్ పాండే (15), నినాద్ రాథ్వా (0), మితేశ్ పటేల్ (0) విఫలమయ్యారు. జ్యోస్నిల్ సింగ్ (32) ఫర్వాలేదనిపించాడు. ఆంధ్ర బౌలర్లలో సాయితేజ 28 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతడికిదే తొలి మ్యాచ్ కాగా... ఈ కుడి చేతివాటం మీడియం పేసర్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. త్రిపురాన విజయ్ 2 వికెట్లు తీశాడు.


