‘సంజయ్ దత్పై దయ చూపవద్దు’ | NCP, BJP oppose moves to pardon Sanjay Dutt | Sakshi
Sakshi News home page

‘సంజయ్ దత్పై దయ చూపవద్దు’

Oct 26 2013 10:59 AM | Updated on Mar 29 2019 9:18 PM

‘సంజయ్ దత్పై దయ చూపవద్దు’ - Sakshi

‘సంజయ్ దత్పై దయ చూపవద్దు’

వరుస బాంబు పేలుళ్ల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు క్షమాభిక్షపై రాజకీయ పార్టీలతోపాటు అనేక వర్గాలనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

పుణే: వరుస బాంబు పేలుళ్ల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు క్షమాభిక్షపై రాజకీయ పార్టీలతోపాటు అనేక వర్గాలనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శరద్‌పవార్ సారథ్యంలోని ఎన్సీపీతోపాటు బీజేపీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఎన్సీపీ అగ్రనాయకుడు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ పాటిల్ మాట్లాడుతూ ‘పేలుళ్ల కేసులో సంజయ్ దోషిగా కోర్టు నిర్ధారించింది. న్యాయ ప్రక్రియ ముగిసిన అనంతరం జైలుశిక్ష విధించింది.

ఆయనకు విధించిన తీర్పును క్షమిస్తే అప్పుడు న్యాయ ప్రక్రియకు అర్ధమే లేదు. తమను కూడా క్షమించాలంటూ ఇతర దోషులు కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇటువంటి డిమాండ్లు మున్ముందు బాగా పెరుగుతాయి’ అని అన్నారు. ‘సంజయ్‌కి శిక్ష తగ్గించాలా వద్దా అనే విషయంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ఇంకా ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సంజయ్‌కి కఠిన శిక్ష విధించాలని స్వయంగా హోం శాఖే డిమాండ్ చేసింది’ అని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

 ఎటువంటి చర్యనైనా వ్యతిరేకిస్తాం

 సంజయ్‌కి క్షమాపణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఎటువంటి చర్యలనైనా తాము వ్యతిరేకిస్తామని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటించింది. ఈ విషయమై ఆ పార్టీ నాయకుడు వినోద్ తావ్డే మీడియాతో మాట్లాడుతూ ‘సంజయ్‌దత్ ని క్షమించాలనే విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడమనేది సరికాదు. సంజయ్ విషయంలో ఎటువంటి దయ చూపనవసరం లేదు. ఇప్పుడు దత్ ఎవరనే  విషయంతో మాకు సంబంధం లేదు. 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో అతని ప్రమేయం ఆధారంగానే సుప్రీంకోర్టు శిక్ష విధించింది.

అందువల్ల ఇప్పుడు అతనిని క్షమించడం దేశ ప్రజలకు తప్పుడు సందేశం పంపడమే అవుతుంది’ అని అన్నారు. దత్‌ను సుప్రీంకోర్టు దోషిగా ఖరారుచేసిందని, అందువల్ల అతనిపై ఎటువంటి సానుభూతి చూపనవసరం లేదన్నారు. క్షమాభిక్షను పరిశీలించొద్దని కోరతామన్నారు. సంజయ్‌కి క్షమాభిక్ష విషయంలో అభిప్రాయం తెలియజేయాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement