'మా సంస్కృతి కోసం సరికొత్త ఉద్యమం' | Muslim board to launch 'save religion and constitution' movement | Sakshi
Sakshi News home page

'మా సంస్కృతి కోసం సరికొత్త ఉద్యమం'

Sep 5 2015 3:47 PM | Updated on Sep 3 2017 8:48 AM

'మా సంస్కృతి కోసం సరికొత్త ఉద్యమం'

'మా సంస్కృతి కోసం సరికొత్త ఉద్యమం'

మత, సాంస్కృతిక, రాజ్యాంగ పరంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కొనేందుకు సరికొత్త ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది.

హైదరాబాద్: మత, సాంస్కృతిక, రాజ్యాంగ పరంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కొనేందుకు సరికొత్త ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు ముస్లిం సమాజ అత్యున్నత వ్యవస్థ  ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీబీ) ప్రకటించింది. రాజ్యాంగం ప్రతిపాదించిన లౌకిక నియమాన్ని పక్కనపెట్టి, కేవలం ఒకే మతానికి చెందిన సాంస్కృతిక ధర్మాలను పాటించాల్సిందిగా కేంద్రం ఒత్తిడి తెస్తున్నదని, దీనికి వ్యతిరేకంగా 'దీన్ ఔర్ దస్తర్ బచావో' (సేవ్ రిలీజియన్ అండ్ కాన్స్టిట్యూషన్) పేరుతో దేశవ్యాప్త ఉద్యమాన్ని మొదలు పెడతామని ఏఐఎంపీబీ జనరల్ సెక్రటరీ మౌలానా సజ్జాద్ నమానీ చెప్పారు.

శనివారం హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఇతర వెనకబడిన వర్గాలను కూడా తమతో పాటు కలుపుకొని పోతామన్నారు. ఉద్యమంలో పాల్గొనేలా ప్రజలను సంసిద్ధులను చేయడంకోసం సభలు, సెమినార్లు, ఇష్టాగోష్టి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. యోగా, సూర్యనమస్కారాలు, వందేమాతరం గీతాలాపన వంటి ఒత్తిళ్లతో ఇస్లామ్ ధర్మం, సంస్కృతులకు ముప్పు వాటిల్లే ప్రమాదమున్నదని, పాఠశాల, కళాశాలల పాఠ్యపుస్తకాలను చూస్తే ఈ విషయం సులువుగా అర్థమవుతుందని, ఇలాంటి చర్యలు ముస్లింల అభివృద్ధికి ఆటంకాలుగా మారయని మౌలానా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐఎంపీబీ సెక్రటరీ మౌలానా వలీ రహమాని, ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, అబ్దుల్ రహీమ్ ఖురేషీ, మౌలానా ఖలీద్ సైఫుల్లా రహమాని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

పోల్

Advertisement