breaking news
new movement
-
కేంద్ర ప్రభుత్వానికి స్టాలిన్ వార్నింగ్
చెన్నై: డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ మళ్లీ తమిళ జపాన్ని తెరమీదకు తెచ్చారు. జాతీయ రహదారులపై హిందీ సైన్ బోర్డులను తమిళంలోకి మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే మరో ఉద్యమం తప్పదని స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించారు. హిందీ ప్రాధాన్యత ఇచ్చి తమిళ భాషను తక్కువ చేసి చూస్తే సహించేది లేదని ఆయన అన్నారు. కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. బలవంతంగా తమపై హిందీ రుద్దితే ఊరుకునేది లేదన్నారు. కాగా హిందీ పట్ల తమిళనాడు ఇంకా తన వ్యతిరేకతను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. దేశమంతా త్రిభాషా సూత్రం అమలు చేయాలన్న కేంద్రం ఉత్తర్వులను అమలు చేయని ఏకైక రాష్ట్రం తమిళనాడు. అక్కడ హిందీ భాషను నేర్పించరు. అంతేకాకుండా ఆకాశవాణిలో వచ్చే హిందీ వార్తలను మిగిలిన కేంద్రాలన్నీ ప్రసారం చేస్తాయి కానీ తమిళనాడులో మాత్రం ప్రసారం కావు. -
'మా సంస్కృతి కోసం సరికొత్త ఉద్యమం'
హైదరాబాద్: మత, సాంస్కృతిక, రాజ్యాంగ పరంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కొనేందుకు సరికొత్త ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు ముస్లిం సమాజ అత్యున్నత వ్యవస్థ ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీబీ) ప్రకటించింది. రాజ్యాంగం ప్రతిపాదించిన లౌకిక నియమాన్ని పక్కనపెట్టి, కేవలం ఒకే మతానికి చెందిన సాంస్కృతిక ధర్మాలను పాటించాల్సిందిగా కేంద్రం ఒత్తిడి తెస్తున్నదని, దీనికి వ్యతిరేకంగా 'దీన్ ఔర్ దస్తర్ బచావో' (సేవ్ రిలీజియన్ అండ్ కాన్స్టిట్యూషన్) పేరుతో దేశవ్యాప్త ఉద్యమాన్ని మొదలు పెడతామని ఏఐఎంపీబీ జనరల్ సెక్రటరీ మౌలానా సజ్జాద్ నమానీ చెప్పారు. శనివారం హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఇతర వెనకబడిన వర్గాలను కూడా తమతో పాటు కలుపుకొని పోతామన్నారు. ఉద్యమంలో పాల్గొనేలా ప్రజలను సంసిద్ధులను చేయడంకోసం సభలు, సెమినార్లు, ఇష్టాగోష్టి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. యోగా, సూర్యనమస్కారాలు, వందేమాతరం గీతాలాపన వంటి ఒత్తిళ్లతో ఇస్లామ్ ధర్మం, సంస్కృతులకు ముప్పు వాటిల్లే ప్రమాదమున్నదని, పాఠశాల, కళాశాలల పాఠ్యపుస్తకాలను చూస్తే ఈ విషయం సులువుగా అర్థమవుతుందని, ఇలాంటి చర్యలు ముస్లింల అభివృద్ధికి ఆటంకాలుగా మారయని మౌలానా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐఎంపీబీ సెక్రటరీ మౌలానా వలీ రహమాని, ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, అబ్దుల్ రహీమ్ ఖురేషీ, మౌలానా ఖలీద్ సైఫుల్లా రహమాని తదితరులు పాల్గొన్నారు.