
ముకేశ్ రాథోడ్ కుబుంబ సభ్యులు
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది.
అహ్మదాబాద్: గుజరాత్‌కు చెందిన ఒక్క సైనికుడూ యుద్ధబూమిలో అమరుడు కాలేదని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. వాస్తవాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడం సరికాదని గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమరవీరుల కుటుంబాలు మండిపడ్డాయి.
అఖిలేశ్ వ్యాఖ్యలు తమకు తీవ్ర ఆవేదన కలిగించాయని 1999 కార్గిల్ యుద్ధంలో అమరుడైన ముకేశ్ రాథోడ్ భార్య రాజశ్రీ అన్నారు. అమరవీరులు ఒక రాష్ట్రానికి చెందిన వారు కాదని, దేశానికి చెందిన వారని పేర్కొన్నారు. సైనికులు ప్రాణాలు కోల్పోతే దేశానికి నష్టం జరిగినట్టుగా భావించాలని, రాష్ట్రానికి కాదని అన్నారు. ముకేశ్ చనిపోయే నాటికి ఆమె ఐదు నెలల గర్భిణి. ఇప్పుడు ఆమె కుమారుడికి 17 ఏళ్లు. దేశంలో ఎన్నో సైనిక కుటుంబాలు కొడుకుల్ని, భర్తలను, సోదరులను, తండ్రులను పోగొట్టుకున్నాయని ముకేశ్ తల్లి సంజుబెన్ రాథోడ్ కన్నీళ్ల పర్యంతమయ్యారు. అమరవీరుల కుటుంబాలు పడుతున్న బాధ అఖిలేశ్ యాదవ్ లాంటి రాజకీయ నాయకులకు అర్థంకాకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.
గుజరాత్ గురించి అఖిలేశ్‌కు ఏమీ తెలియదని ఆయన వ్యాఖ్యలను బట్టి తనకర్థమైందని 65 ఏళ్ల జగదీశ్ సోని అన్నారు. ఆయన సోదరుడు కెప్టెన్ నిలేశ్ సోని.. 1987లో సియాచిన్ వద్ద పాకిస్తాన్ సైనికులను అడ్డుకుని ప్రాణాలు కోల్పోయారు. అమరవీరులను రాష్ట్రాలవారీగా చూడడం పట్ల జగదీశ్ తీవ్ర ఆవేదన తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వీర సైనికుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో తీవ్రవాదులతో పోరాడుతూ తన కుమారుడు అమరుడయ్యాడని మేజర్ రుషికేశ్ రమణి తల్లి గీతా రమణి(54) తెలిపారు. రాష్ట్రాలు, కులం, మతం ఆధారంగా అమరవీరుల త్యాగాలను తక్కువ చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని అఖిలేశ్ యాదవ్‌కు సూచించారు.
ఈ ఏడాది జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో తన కొడుకు లాన్స్‌నాయక్ గోపాల్ సింగ్ అమరుడయ్యాడని ఆయన తండ్రి మునిమ్ సింగ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో అధికారం కోల్పోవడంతో అఖిలేశ్ యాదవ్ మానసిక పరిస్థితి దెబ్బతిందని, పనికిమాలిన ప్రకటనలతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.