దేశ రాజధాని ఢిల్లీలో కేవలం 80 రూపాయలు పంచుకునే విషయంలో గొడవ పడి ఓ వ్యక్తి తన స్నేహితుడిని చంపేశాడు.
బీరు బాటిల్ కోసమో, బిర్యానీ పొట్లం కోసమో హత్యలు జరగడం చూశాం. కానీ దేశ రాజధాని ఢిల్లీలో కేవలం 80 రూపాయలు పంచుకునే విషయంలో గొడవ పడి ఓ వ్యక్తి తన స్నేహితుడిని చంపేశాడు. వినోద్ అనే వ్యక్తిని పీక పిసికి చంపేసిన కేసులో పప్పు యాదవ్ (27)ను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లిద్దరూ గత మూడు నాలుగేళ్లుగా కూలీలుగా పనిచేస్తున్నారు. వాళ్లు యమునా బజార్లో పాత ఢిల్లీ రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ నైట్ షెల్టర్లో ఉంటున్నారు.
అక్టోబర్ 30న వాళ్లు జనక్పురిలో ఓ కార్యక్రమం జరిగితే అక్కడ పనిచేశారు. వాళ్ల పనితీరు నచ్చిన నిర్వాహకుడు శనివారం నాడు వాళ్లకు రూ. 100 ఇచ్చి పంచుకోమని చెప్పాడు. అందులో 20 రూపాయలతో మద్యం కొనుక్కుని అక్కడే తాగడం మొదలుపెట్టారు. మిగిలిన 8౦ రూపాయలు పంచుకోవాల్సి ఉంది. కానీ, తాగిన మత్తులో ఇద్దరూ ఆ మొత్తం కోసం కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఈ గొడవలో పప్పు ఓ తాడు తీసుకుని వినోద్ పీక పిసికి, అక్కడినుంచి పారిపోయాడు.