ఫేస్‌బుక్ నకిలీ ప్రొఫైల్‌తో.. బ్లాక్‌మెయిల్ | man arrested for abusing girls with fake facebook accounts | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ నకిలీ ప్రొఫైల్‌తో.. బ్లాక్‌మెయిల్

Aug 25 2016 11:14 AM | Updated on Oct 9 2018 5:39 PM

ఫేస్‌బుక్ నకిలీ ప్రొఫైల్‌తో.. బ్లాక్‌మెయిల్ - Sakshi

ఫేస్‌బుక్ నకిలీ ప్రొఫైల్‌తో.. బ్లాక్‌మెయిల్

నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లతో అమ్మాయిలను వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

అతడు అందమైన అమ్మాయిల ఫొటోలతో నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాడు. యువతులకు ఫ్రెండ్ రిక్వెస్టు పంపి, వాళ్లతో చాటింగ్ మొదలుపెడతాడు. కొన్నాళ్ల తర్వాత కలుద్దామని చెబుతాడు. వాళ్లు నిరాకరిస్తే, వారి ప్రొఫైల్‌లో ఉన్న ఫొటోలతో మరో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి, దాంట్లో వాళ్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి దారుణంగా పెడతాడు. ఆ అకౌంట్‌ను పోర్న్ కంటెంట్‌తో నింపేస్తాడు. దాంతోపాటు వాళ్ల వివరాలను ఎస్కార్ట్ వెబ్‌సైట్లలో పెడతాడు. అంతటితో అయిపోదు.. నకిలీ ప్రొఫైల్‌ను వాళ్ల స్కూలు ఫేస్‌బుక్ అకౌంటులో పెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేసి, వాళ్ల నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తాడు.

ఎట్టకేలకు ఈ మోసగాడిని పోలీసులు పట్టుకున్నారు. అతడి పేరు అఖిలేష్ (24). పెళ్లి కూడా అయింది. ఇప్పటివరకు ఇలా వంద మంది వరకు అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేశాడు. చిన్నవయసు నుంచే అతడికి తప్పులు చేయడం అలవాటు. స్కూలు రికార్డులలో తన తండ్రి పేరుకు బదులు మామ పేరు రాశాడు. డ్రైవింగ్ లైసెన్సుకు కూడా అలాగే చేశాడు. మధ్యప్రదేశ్‌లోని భింద్ ప్రాంతానికి చెందిన అఖిలేష్, ఢిల్లీలోని బక్కర్‌వాలా ప్రాంతంలో నివసిస్తాడు. పదోతరగతి ఫెయిలై చదువు మానేశాడు. వజీర్‌పూర్‌లోని ఓ ఎగుమతుల కంపెనీలో పనివాడిగా చేరి, డ్రైవర్ అయ్యాడు. బాలీవుడ్‌లో పాటలు పాడాలని అనుకునేవాడు. పొరుగునుండే ఓ అమ్మాయితో స్నేహం చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. తర్వాతి నుంచి ఫేస్‌బుక్ వ్యవహారం మొదలుపెట్టాడు. అతడిపై 354డి, 509, 506లతో పాటు పోస్కోచట్టంలోని 12వ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.

ఫేస్‌బుక్ మెసెంజర్ సాయంతో తన కూతురిని ఎవరో వేధిస్తూ, బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు ఓ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో అఖిలేష్ బాగోతం మొత్తం బయటపడింది. ఆమె ఫోన్ నంబరును అసభ్యకరమైన టైటిళ్లతో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. చివరకు సైబర్‌సెల్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ రమేష్ దహియా ఇతడి గుట్టు రట్టుచేశారు. సుమారు వంద మంది అమ్మాయిల నెంబర్లతో కూడిన మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement