
టీ సమస్యను యూపీఏ జటిలం చేసింది: మమతా బెనర్జీ
ప్రత్యేక తెలంగాణ అంశాన్ని కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం మరింత చిక్కుపడేలా చేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు.
పనాగఢ్: ప్రత్యేక తెలంగాణ అంశాన్ని కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం మరింత చిక్కుపడేలా చేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ప్రజలు ఇదివరకే తిరస్కరించిన, త్వరలో దిగిపోనున్న యూపీఏ సర్కారు.. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌ను విభజించేందుకు చేస్తున్న ప్రయత్నం ఆమోదయోగ్యం కాదన్నారు. శుక్రవారం బుర్ద్వాన్ జిల్లాలో మాటీ ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్న మమత మాట్లాడుతూ.. ఎన్నికల కోణంలో లెక్కలు వేసుకున్న తర్వాతే తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు ఆ ప్రభుత్వమే సమస్యలో చిక్కుకుందన్నారు.
లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడం సందర్భంగా గురువారం చోటుచేసుకున్న పరిణామాలపై స్పందిస్తూ మమత ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ కోసం సుదీర్ఘకాలంగా సాగుతున్న ఆందోళనలను తమ ప్రభుత్వం విజయవంతంగా తగ్గించి శాంతి నెలకొనేలా చేసిందన్నారు.