టెన్త్ విద్యార్థులకు లైవ్ పాఠాలు! | lessons Liveto Tenth students! | Sakshi
Sakshi News home page

టెన్త్ విద్యార్థులకు లైవ్ పాఠాలు!

Jan 19 2016 4:07 AM | Updated on Sep 3 2017 3:51 PM

రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మార్చి 21 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో...

‘మన టీవీ’ ద్వారా కార్యక్రమాల ప్రసారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మార్చి 21 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ పాఠ్యాంశాలపై బోధన అందించడంతోపాటు విద్యార్థులు తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ‘లైవ్ టీవీ’ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వం నిర్వహించే మన టీవీ ద్వారా లైవ్ పాఠాలు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ప్రతి రోజు లైవ్ పాఠాలు బోధించడంతోపాటు రికార్డు చేసిన రెండు పాఠాలను చెబుతారు.

లైవ్‌లో టీచర్ బోధిస్తున్నప్పుడు అనుమానాలు వస్తే నివృత్తి చేసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నంబరుకు ఫోన్ చేస్తే లైవ్‌లోనే వారి అనుమానాలను నివృత్తి చేస్తారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రాష్ట్రంలోని 2,408 ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం మన టీవీ కార్యక్రమాలను వీక్షించేందుకు ఏర్పాట్లు ఉన్నందున, వాటన్నింటికి ఈ సదుపాయాన్ని సోమవారం నుంచి అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) డెరైక్టర్ ఎస్.జగన్నాథరెడ్డి చెప్పారు.
 
ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్టు
ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్టు పాఠ్యాంశాన్ని బోధిస్తారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1.45 నుంచి 2.30 గంటల వరకు లైవ్ పాఠాల కార్యక్రమం ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు వీటిని చూపాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక రికార్డెడ్ పాఠాలను ప్రతి రోజు ఉదయం 10:15 గంటల నుంచి 11:15 గంటల వరకు బోధిస్తారు. సోమవారం తెలుగు, మంగళవారం హిందీ, బుధవారం ఇంగ్లిష్, గురువారం గణితం, శుక్రవారం సైన్స్, శనివారం సాంఘిక శాస్త్రం పాఠాలను మన టీవీ ద్వారా బోధిస్తారు. సులభంగా అర్థమయ్యేలా వీడియో క్లిప్పింగ్స్, యానిమేషన్‌తో కూడిన బొమ్మలను చూపుతారు.
 
అన్ని పాఠశాలల్లో అమల్లోకి తెచ్చేలా..

రాష్ట్రంలో ప్రస్తుతం 5,617 ఉన్నత పాఠశాలలు ఉండగా, మన టీవీ కార్యక్రమాలు వీక్షించే సదుపాయం 2,408 పాఠశాలల్లో ఉంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మిగతా వాటిలోనూ ఈ కార్యక్రమాల కోసం టీవీ, డిష్ యాం టెన్నా, సెట్ టాప్ బాక్సులను కల్పించేందుకు విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. అంతేకాకుండా మన టీవీ కార్యక్రమాలను విద్యార్థులు వీక్షించేందుకు వీలుగా 6 నుంచి 10వ తరగతి వరకు అకడమిక్ కేలండర్‌లోనూ ప్రత్యేకంగా సమయం కేటాయించి జూలై నుంచి మార్చి వరకు పీరియడ్‌లను పొందుపరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement