ఐవీఆర్‌సీఎల్ మరో 2 ప్రాజెక్ట్‌ల అమ్మకం! | IVRCL to sell assets including Chennai Desalination Plant and Jalandhar-Amritsar Highway project | Sakshi
Sakshi News home page

ఐవీఆర్‌సీఎల్ మరో 2 ప్రాజెక్ట్‌ల అమ్మకం!

Sep 28 2013 2:01 AM | Updated on Sep 1 2017 11:06 PM

ఐవీఆర్‌సీఎల్ మరో 2 ప్రాజెక్ట్‌ల అమ్మకం!

ఐవీఆర్‌సీఎల్ మరో 2 ప్రాజెక్ట్‌ల అమ్మకం!

ఇప్పటికే పలు రోడ్ ప్రాజెక్ట్‌లను విక్రయించిన మౌలిక రంగ దిగ్గజం ఐవీఆర్‌సీఎల్ తాజాగా మరో రెండు ఆస్తుల విక్రయానికి సిద్ధపడుతోంది.

హైదరాబాద్: ఇప్పటికే పలు రోడ్ ప్రాజెక్ట్‌లను విక్రయించిన మౌలిక రంగ దిగ్గజం ఐవీఆర్‌సీఎల్ తాజాగా మరో రెండు ఆస్తుల విక్రయానికి సిద్ధపడుతోంది. వీటిలో ఒకటి చెన్నై డీశాలినేషన్ ప్రాజెక్ట్‌కాగా, పంజాబ్‌లోని జలంధర్-అమృత్‌సర్ జాతీయ రహదారుల ప్రాజెక్ట్ మరొకటి. ఈ విషయాలను వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) సందర్భంగా కంపెనీ చైర్మన్ ఇ.సుధీర్ రెడ్డి వాటాదారులకు వెల్లడించారు.
 
 ఈ రెండు ప్రాజెక్ట్‌ల ద్వారా రూ. 1,100 కోట్లను సమీకరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఆమేరకు రుణ భారాన్ని తగ్గించుకోవాలనేది కంపెనీ ప్రణాళిక. కంపెనీకి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ప్రస్తుతం రూ. 6,100 కోట్లమేర రుణాలున్నాయి. ఈ బాటలో ఇప్పటికే మూడు రోడ్ ప్రాజెక్ట్‌లను విక్రయించిన సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి సాలెం టోల్ వే కాగా, మిగిలినవి... కుమారపళయం టోల్ వే, చెంగపల్లి టోల్ వే. నిర్మించడం, నిర్వహించడం, బదిలీ చేయడం(బీవోటీ) ప్రాతిపదికన ఏర్పాటు చేసిన వీటిని రూ. 2,200 కోట్లకు అమ్మివేసింది. టాటా గ్రూప్‌నకు చెందిన ట్రిల్ రోడ్స్‌కు విక్రయించింది. కాగా, తుది దశలో ఉన్న మరికొన్ని బీవోటీ ప్రాజెక్ట్‌లపై కంపెనీ దృష్టి పెట్టింది. రానున్న ఆరు నెలల్లో 155 కిలోమీటర్ల ఇండోర్-ఝబువా రోడ్ ప్రాజెక్ట్ పూర్తికానున్నట్లు సుధీర్ తెలిపారు. దీంతోపాటు మహారాష్ట్రలోని బారామతీ-ఫాల్టన్ రోడ్ ప్రాజెక్ట్ వాణిజ్య కార్యకలాపాలు సైతం త్వరలో మొదలుకానున్నట్లు వివరించారు.
 
 రోజుకి 10 కోట్ల లీటర్లు
 తొలి దశలో కొన్ని రోడ్ ప్రాజెక్ట్‌లను విక్రయించిన ఐవీఆర్‌సీఎల్ రెండో దశలో భాగంగా మరో రెండు ప్రాజెక్ట్‌లను అమ్మకానికి పెట్టింది. వీటిలో చెన్నై డీశాలినేషన్ ప్లాంట్‌కు రోజుకి 10 కోట్ల లీటర్ల సముద్ర జలాలను శుద్ధి చేయగల సామర్థ్యముంది. 2010లో రూ. 600 కోట్ల పెట్టుబడితో కంపెనీ ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. రానున్న 9 నెలల్లో వీటి అమ్మకం పూర్తికాగలదన్న ఆశాభావాన్ని సుధీర్ వ్యక్తం చేశారు. డీశాలినేషన్ ప్లాంట్‌పట్ల మూడు సంస్థలు ఆసక్తిని చూపుతున్నప్పటికీ అమ్మకం ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. ఇక పంజాబ్ రోడ్ ప్రాజెక్ట్ ద్వారా రూ. 450 కోట్ల ఈక్విటీ పెట్టుబడులను తిరిగి పొందగలమని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. కాగా, గతేడాది(2012-13) కంపెనీ రూ. 3,579 కోట్ల టర్నోవర్‌పై రూ. 102 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసుకుంది. ఇందుకు రూ. 348 కోట్లమేర వడ్డీ తదితర వ్యయాల చెల్లింపు కారణమైంది. వడ్డీ రేట్ల పరిస్థితుల్లో నిలకడ వచ్చేవరకూ కొత్తగా బీవోటీ ప్రాజెక్ట్‌లకు బిడ్డింగ్ చేయబోమని సుధీర్ తెలిపారు. కాగా, బీఎస్‌ఈలో ఐవీఆర్‌సీఎల్  షేరు ధర 1.2% నష్టపోయి రూ. 11.80 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement