నింగిలోకి తొలి ‘సైనిక’ ఉపగ్రహం | India's first military satellite successfully launched | Sakshi
Sakshi News home page

నింగిలోకి తొలి ‘సైనిక’ ఉపగ్రహం

Aug 31 2013 2:33 AM | Updated on Sep 1 2017 10:17 PM

నింగిలోకి తొలి ‘సైనిక’ ఉపగ్రహం

నింగిలోకి తొలి ‘సైనిక’ ఉపగ్రహం

భారత సైనిక అవసరాల కోసం రూపొందించిన తొలి ఉపగ్రహం ‘జీశాట్-7’ను విజయవంతంగా రోదసీలోకి పంపించారు.

సూళ్లూరుపేట, న్యూస్‌లైన్/ బెంగళూరు: భారత సైనిక అవసరాల కోసం రూపొందించిన తొలి ఉపగ్రహం ‘జీశాట్-7’ను విజయవంతంగా రోదసీలోకి పంపించారు. ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక 2 గంటలకు దీన్ని యూరోపియన్ అంతరిక్ష సహకార సంస్థ ఏరియన్‌స్పేస్‌కు చెందిన ఏరియన్-5 రాకెట్ ద్వారా ప్రయోగించి కక్ష్యలో ప్రవేశపెట్టారు. 34 నిమిషాల 25 సెకన్ల ప్రయాణం తర్వాత ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోయి తొలిదశ కక్ష్యలోకి వెళ్లింది. విడిపోవడానికి ఐదు నిమిషాలకు ముందు కర్ణాటక హసన్‌లోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాస్టర్ కంట్రోల్ కేంద్రానికి ఉపగ్రహం నుంచి సంకేతాలు అందాయి.
 
 ఉపగ్రహంలోని సౌర ఫలకాలు విద్యుదుత్పత్తి ప్రారంభించాయి. జీశాట్-7 వచ్చే నెలాఖరుకల్లా సేవలు ప్రారంభిస్తుందని ఇస్రో తెలిపింది. 2,625 కేజీల బరువున్న అత్యాధునిక మల్టీబ్యాండ్ జీశాట్-7ను ఇస్రో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. దీని తయారీకి రూ.187 కోట్లు, ప్రయోగం, బీమా తదితరాలకు రూ.470 కోట్లు ఖర్చయ్యాయి. వచ్చే నెల 4 నాటికి నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెడతారు. అంతరిక్ష ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా నౌకాదళాన్ని ఆధునీకరించి బలోపేతం చేయడానికి, సముద్ర ప్రాంతాలు, భూతలంపై నిఘా పటిష్టం చేయడానికి దీన్ని ప్రయోగించారు. ఈ ఉపగ్రహం తక్కువ స్థాయి వాయిస్ డేటాతోపాటు భారీస్థాయిలో సమాచారాన్ని పంపుతుందని ఇస్రో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement