భరతమాత ముద్దుబిడ్డకు ఘన నివాళులు | India honours Kalam's wish for no holiday on his death | Sakshi
Sakshi News home page

భరతమాత ముద్దుబిడ్డకు ఘన నివాళులు

Jul 29 2015 1:00 AM | Updated on Aug 20 2018 3:02 PM

భరతమాత ముద్దుబిడ్డకు ఘన నివాళులు - Sakshi

భరతమాత ముద్దుబిడ్డకు ఘన నివాళులు

మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్‌కలాంకు దేశం యావత్తూ ఘన నివాళులర్పించింది.

అబ్దుల్ కలాం మృతికి పార్లమెంటు, కేబినెట్ సంతాపం
 పాలం విమానాశ్రయంలో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
 మాజీ రాష్ట్రపతికి ప్రవాస భారతీయుల సంతాపం
 రేపు తమిళనాడులోని రామేశ్వరంలో అంత్యక్రియలు
 
 
 న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్‌కలాంకు దేశం యావత్తూ ఘన నివాళులర్పించింది. ఆయన భరతమాత ముద్దుబిడ్డ అని.. నిజమైన ఆణిముత్యమని రాజకీయ పార్టీలకు అతీతంగా అనేక మంది నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు కొనియాడారు. షిల్లాంగ్‌లో సోమవారం రాత్రి కన్నుమూసిన కలాం భౌతికకాయాన్ని మంగళవారం తొలుత గువాహటికి, అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకువచ్చారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా ప్రభుత్వ పెద్దలు మంగళవారం ఢిల్లీలో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కలాం నివాసం 10 రాజాజీమార్గ్‌లో ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.

 

ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకూ భారమైన హృదయాలతో కలాంను చివరిసారి వీక్షించి నివాళులర్పించటానికి పెద్ద సంఖ్యలో వరుసకట్టారు. ఆయన పార్థివదేహానికి గురువారం (30వ తేదీన) తమిళనాడులోని రామేశ్వరంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కలాం మరణానికి సంతాపం తెలుపుతూ.. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. పార్లమెంటు ఉభయసభలూ మంగళవారం కలాం మృతిపట్ల శ్రద్ధాంజలి ఘటించి, ఆయన సేవలను కొనియాడుతూ నివాళులర్పించాయి.
 
 షిల్లాంగ్ నుంచి ఢిల్లీకి...
 
 మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం సోమవారం రాత్రి షిల్లాంగ్‌లో ఐఐఎంలో ఉపన్యసిస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని.. మంగళవారం ఉదయం షిల్లాంగ్ నుంచి వైమానికదళ హెలికాప్టర్ ద్వారా గువాహటికి తరలించారు. మేఘాలయ గవర్నర్ వి.షణ్ముగానాథన్ కూడా హెలికాప్టర్‌లో భౌతికకాయం వెంట రాగా.. గువాహటిలో అస్సాం ముఖ్యమంత్రి తరుణ్‌గొగోయ్ కలాం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

 

గువాహటి నుంచి ప్రత్యేక వైమానికదళ విమానంలో కలాం పార్థివదేహాన్ని ఢిల్లీకి తీసుకువచ్చారు. షణ్ముగనాథన్ కూడా కలాం పార్థివదేహంతో పాటు ఢిల్లీ చేరుకున్నారు. పాలం టెక్నికల్ ఏరియాలో విమానం దించిన భౌతికకాయాన్ని పూలతో అలంకరించిన వేదికపై ఉంచారు. త్రివర్ణ పతాకం కప్పి ఉన్న కలాం భౌతికకాయాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్‌అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తదితర ప్రభుత్వ ప్రముఖులు సందర్శించి పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించారు. త్రివిధ దళాలు సైనిక వందనం సమర్పించాయి.
 
 
 
 రేపు రామేశ్వరంలో అంత్యక్రియలు
 
 అబ్దుల్‌కలాం భౌతికకాయనికి ఈ నెల 30వ తేదీ (గురువారం) ఉదయం 11 గంటలకు తమిళనాడులో ఆయన జన్మస్థలమైన రామేశ్వరంలో ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి సైనిక గౌరవంతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కలాం కుటుంబం, ఆయన అన్న ముత్తు మొహమ్మద్ మీరన్ మారక్కయిర్ (99).. తన సోదరుడి అంత్యక్రియలను రామేశ్వరంలో నిర్వహించాలని ఆకాంక్షించారు. రక్షణశాఖ అధికార ప్రతినిధి సీతాంశుకర్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. కలాం భౌతికకాయంతో సైనిక వాహనం బుధవారం ఉదయం 7 గంటలకు.. ఆయన నివాసం 10 రాజాజీ మార్గ్ నుంచి పాలం బయల్దేరి వెళుతుంది.

 

పాలం విమానాశ్రయం నుంచి ఉదయం 7:45 గంటలకు ప్రత్యేక విమానంలో కేంద్రమంత్రులు మనోహర్‌పారికర్, వెంకయ్యనాయుడు.. కలాం పార్థివదేహాన్ని తీసుకుని తమిళనాడులోని మధురై చేరుకుంటారు. అక్కడి నుంచి వైమానికదళ హెలికాప్టర్‌లో కలాం పార్థివదేహాన్ని రామేశ్వరం తీసుకెళతారు. అక్కడ బుధవారం సాయంత్రం 7 గంటల వరకూ ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉంచుతారు. గురువారం ఉదయం 11 గంటలకు రామేశ్వరంలోని ఆయన స్వస్థలంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కలాం అంత్యక్రియల నేపథ్యంలో గురువారం తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో అధికారిక సెలవు ప్రకటించింది.
 
 
 10 రాజాజీ మార్గ్‌కు ప్రజా వెల్లువ
 
 పూలతో అలంకరించిన సైనిక వాహనంపై కలాం భౌతికకాయాన్ని ఊరేగింపుగా 12 కిలోమీటర్ల దూరంలోని ఆయన నివాసం 10 రాజాజీమార్గ్‌కు తీసుకువచ్చారు. అక్కడ పెద్ద సంఖ్యలో ప్రముఖులు, వేల సంఖ్యలో ప్రజలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి అశ్రునివాళులు అర్పించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యా, సినీ రంగాల ప్రముఖులు చాలా మంది కలాం నివాసానికి కూడా చేరుకుని పుష్పాంజలి ఘటించారు. రక్షణమంత్రి మనోహర్‌పారికర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్, ముఖ్యమంత్రి అరవింద్‌కేజ్రీవాల్, త్రివిధ దళాల అధిపతులు, భారత వాయుసేన మార్షల్ అయిన 99 ఏళ్ల అర్జున్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ఆ పార్టీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ దంపతులు, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్‌యాదవ్, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్‌యాదవ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌భగవత్, వామపక్షాల నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తదితరులు కలాంకు తుది నివాళులర్పించిన వారిలో ఉన్నారు. కలాం అన్న మనువళ్లు ఇద్దరికి ఆయా నేతలు, ప్రముఖులు సంతాపం తెలియజేశారు. పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్‌బాసిత్, ఇజ్రాయెల్ రాయబారి డానియెల్ కార్మన్ సహా పలు దేశాల రాయబారులు సైతం కలాం పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అమెరికా రాయబారి రిచర్డ్‌వర్మ, నేపాల్ ప్రధానమంత్రి సుశీల్‌కొయిరాలా మల్దీవుల దౌత్యాధికారి అహ్మద్ మొహమ్మద్ తదితరులు సంతాప సందేశాలు పంపించారు.

 

చెన్నైలో కొవ్వొత్తులతో నివాళి అర్పిస్తున్న విద్యార్థులు

 

ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో కలాం పార్థివదేహం వద్ద ప్రధాని మోదీ నివాళులు

 

కర్ణాటకలోని చిక్‌మంగళూర్‌లో ‘మిస్సైల్ మ్యాన్’ను విద్యార్థుల నివాళి

 

కలాంకు అంజలి ఘటిస్తున్న బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ

 

అబ్దుల్ కలాంకు నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ

 

కలాంకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ శ్రద్ధాంజలి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement