
మనసు పడి.. 150 రెక్కీలు చేసి.. కిడ్నాప్!
తొలిసారి చూసినప్పటి నుంచే ఆమెను ఎంతగానో ఇష్టపడ్డాడు. ఆమె మనసు దోచుకోవాలని అనుకున్నాడు. అందుకోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు.. చివరకు కిడ్నాప్ చేశాడు!
తొలిసారి చూసినప్పటి నుంచే ఆమెను ఎంతగానో ఇష్టపడ్డాడు. ఆమె మనసు దోచుకోవాలని అనుకున్నాడు. అందుకోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు.. చివరకు కిడ్నాప్ చేశాడు! అందుకోసం ఏకంగా 150 సార్లు రెక్కీ చేయడమే కాదు.. రెండు ఆటోలు కూడా కొన్నాడు. ఇదీ ఘజియాబాద్‌లో కిడ్నాపైన స్నాప్‌డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా వెనుక జరిగిన కథ. అప్పటికే పెళ్లయిన దేవేందర్ (29) పాత నేరస్తుడు. అతడి మీద మూడు హత్యకేసులు కూడా ఉన్నాయి. తొలుత ఆమె బోయ్‌ఫ్రెండు తమను కిరాయికి మాట్లాడుకున్నాడని, కొంత డబ్బు తీసుకుని ఆమెను వదిలించుకోవాలనుకున్నాడని దీప్తితో దేవేందర్ చెప్పాడు. తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారణ మొదలుపెడితే అసలు విషయం బయటకు వచ్చింది. కిడ్నాపర్ల గ్యాంగు నుంచి తాను విడిపోయి.. ఆమెను విడిచిపెట్టానని, ఆమె మనసు గెలుచుకున్నానని చెబుతున్నాడు.
తొలిసారి దీప్తిని 2015 జనవరిలో రాజీవ్ చౌక్ మెట్రోస్టేషన్‌లో చూశాడు. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. అప్పటినుంచి ఆమె వెనకాలే తిరిగి.. ఎక్కడ ఉంటోంది, ఏం పని చేస్తోంది.. అన్నీ తెలుసుకున్నాడు. ఆమె ఎక్కడికెళ్లినా వెనకాలే ఉండేవాడు. అలా మాల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు.. అన్నింటికీ వెళ్లాడు. తన మీద చాలా కేసులు ఉన్నాయని, ఇప్పుడు ప్రేమ కేసు ఎందుకు ఉండకూడదని పోలీసులను ప్రశ్నించాడంటే అతడి పిచ్చి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అతగాడి మీద ఇప్పటికే మూడు హత్యకేసులు సహా మొత్తం 32 పాత కేసులున్నాయి.
దీప్తి కిడ్నాప్ కేసులో దేవేందర్‌తో పాటు ప్రదీప్, ఫహీమ్, మోహిత్, మాజిద్ అనే నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. దీప్తిని కిడ్నాప్ చేస్తే ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున వస్తాయని వాళ్లకు చెప్పాడు. ఇదంతా హవాలా మార్గంలో వస్తుందని చెప్పడంతో.. వాళ్లు కూడా చాలా సులభంగా డబ్బు సంపాదించొచ్చని భావించారు. ఫిబ్రవరి 10వ తేదీన కిడ్నాప్ చేయాలని, నవంబర్ నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దేవేందర్ రెండు కొత్త సీఎన్‌జీ ఆటోలు కొని.. వాటిని వైశాలి మెట్రో ప్రాంతంలో తిప్పడం మొదలుపెట్టాడు. దీప్తి ప్రతిరోజూ అక్కడి నుంచి ఘజియాబాద్ పాత బస్టాండు వద్దకు ఆటోలో వెళ్తుంది. అక్కడి నుంచి ఆమె తండ్రి కవినగర్‌లో ఇంటికి తీసుకెళ్తారు. ఇవన్నీ తెలుసుకునే అతడు కిడ్నాప్ ప్లాన్ వేశాడు.