తన భర్త తరపున వాదించిన న్యాయవాది లైంగిక దాడికి పాల్పడ్డాడని గుజరాత్ లో ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
అహ్మదాబాద్: తన భర్త తరపున వాదించిన న్యాయవాది లైంగిక దాడికి పాల్పడ్డాడని గుజరాత్ లో ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలి భర్తకు 2009లో ప్రత్యేక న్యాయస్థానం జీవితఖైదు విధించింది. తన భర్త తరపున వాదించిన న్యాయవాది జిగ్నేష్ మెవాడా గత మూడేళ్లలో పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు మెహ్సనా జిల్లాలోని కాది తాలుకా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
తన భర్తను జైలు నుంచి తీసుకొస్తానని చెప్పి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని వెల్లడించింది. నిందితుడు గాంధీనగర్ జిల్లా కోర్టులో లాయర్ గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.