పోలీసుల అధీనంలోకి ‘గోల్కొండ’ | Sakshi
Sakshi News home page

పోలీసుల అధీనంలోకి ‘గోల్కొండ’

Published Tue, Aug 4 2015 2:01 AM

గోల్కొండ కోటలో పోలీసుల కవాతు(ఫైల్)

* పంద్రాగస్టు నేపథ్యంలో పోలీసుల అప్రమత్తత
* ఐఎస్‌ఐఎస్ కదలికలపై కేంద్ర హెచ్చరికలు
* ఉగ్రవాద కార్యకలాపాలపై పోలీసుల డేగ కన్ను

 
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర పురావస్తుశాఖ పరిధిలో ఉన్న గోల్కొండ కోటపై ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి లభించింది. దీంతో కోటను పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇటీవలి కాలంలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాద సంస్థ కదలికలపై కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్రాన్ని అప్రమత్తం చేశాయి.
 
 అలాగే ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందని అమెరికా నిఘా సంస్థలు కూడా హెచ్చరించడంతో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. తెలంగాణ సహా 12 రాష్ట్రాల డీజీపీలతో శనివారం కేంద్ర హోం శాఖ ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న యువత ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలోనే ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐఎస్‌ఐఎస్ కదలికలు, వారి వ్యవహారశైలికి సంబంధించి కొన్ని విషయాలను రాష్ట్ర డీజీపీకి తెలియజేసినట్లు తెలిసింది. దీంతో ఆయన నిఘా వ్యవస్థను అప్రమత్తం చేశారు.
 
 సామాజిక మాధ్యమాలపై నిఘా..
 రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలు పలుమార్లు వెలుగు చూడటంతో సామాజిక మాధ్యమాలపై పోలీసులు నిఘా పెట్టారు. ముఖ్యంగా ఉగ్రవాద సంస్థలు సామాజిక మాధ్యమాల ద్వారా యువతను రెచ్చగొట్టి తమ వైపు తిప్పుకుంటున్నాయని, దీన్ని అరికట్టాలని భావిస్తున్నారు. ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు వెళ్తూ సల్మాన్ మొహినుద్దీన్ ఈ ఏడాది జనవరి 16న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాశ్రయం, రైల్వేస్టేషన్లతో పాటు బస్‌స్టేషన్లపై నిఘా ఉంచారు. ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు ఎక్కువగా ఐఎస్‌ఐఎస్ వైపు ఆకర్షితులవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement