గోదావరి బోర్డు ముందుకు ‘పట్టిసీమ’! | Godavari board Forward 'pattiseema'! | Sakshi
Sakshi News home page

గోదావరి బోర్డు ముందుకు ‘పట్టిసీమ’!

Aug 14 2015 3:09 AM | Updated on Aug 20 2018 6:35 PM

గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంశం గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు చేరనుంది.

సమావేశం ఎజెండాలో చేర్చిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంశం గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు చేరనుంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటివరకు ఉత్తర ప్రత్యుత్తరాలకే పరి మితమైన ఇరు రాష్ట్రాలు.. ఈ నెల 27న జరగనున్న గోదావరి బోర్డు భేటీలో ముఖాముఖి తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. పట్టిసీమ అంశాన్ని సమావేశం ఎజెండాలో చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. గోదావరి బోర్డు అనుమతి లేకుండానే, కనీస సమాచారం ఇవ్వకుండానే.. ఏపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులివ్వడం, పనులు కూడా చేపట్టడంపై తెలంగాణ అభ్యంతరాలను లేవనెత్తనుంది.

దీంతోపాటు గోదావరి నీటిపై ఆధారపడ్డ సీలేరులో విద్యుత్ ఒప్పందాలను ఏపీ ఉల్లంఘిస్తుండడంపై ఎండగట్టనుంది. కృష్ణా నీటిని వాడుకుంటూ రాష్ట్రం చేపట్టిన పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలపై ఏపీ అభ్యంతరాలను లేవనెత్తుతుండగా.. పట్టిసీమను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. పాలమూరు, డిండి పథకాలను తప్పుపడుతూ ఏపీ ఇటీవల పదేపదే కేంద్రానికి ఫిర్యాదులు చేసింది. వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని చెబుతోంది. దీనిపై దీటుగానే స్పందించాలన్న సీఎం కేసీఆర్ సూచన మేరకు అధికారులు కూడా ఏపీ చేపట్టిన ‘పట్టిసీమ’ ఉల్లంఘనలను ఎత్తిచూపుతున్నారు. 1978లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల మధ్య జరిగిన ఒప్పందం మేరకు పోలవరం ప్రాజెక్టు నుంచి మాత్రమే 80టీఎంసీల నీటిని మళ్లించాలని... అంతకుమించి నీటిని మళ్లిస్తే, ఆ నీటిని మూడు రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

ఈ ఒప్పందాన్ని ఏపీ ఉల్లంఘిస్తోందని పేర్కొంటున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగమే అయితే దీనికి సంబంధించిన 80 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాలకు ఉన్న 35 టీఎంసీల వాటాను కర్ణాటక, మహారాష్ట్రలు కృష్ణా జలాల్లో మినహాయించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మిగతా 45 టీఎంసీల వాటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినవి కాగా.. అందులో తెలంగాణ వాటాగా 19 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. 27న జరిగే సమావేశంలో ఈ అంశాలన్నింటినీ లేవనెత్తనున్నారు.
 
సీలేరు నివేదికపైనా..:
గోదావరి జలాల వినియోగంతో ఎగువ, దిగువ సీలేరు ప్రాజెక్టుల్లో ఏపీ కొనసాగిస్తున్న విద్యుదుత్పత్తి వాటాలను తేల్చేందుకు ఉద్దేశించిన నీరజా మాథుర్ కమిటీ నివేదికను కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ) ఇంకా బహిర్గతం చేయని అంశాన్ని ఈ సమావేశంలో తెలంగాణ అధికారులు ప్రస్తావించే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement