ఇంటింటికీ మొక్కలు | ghmc to distribute plants to every home | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ మొక్కలు

Jul 13 2017 3:47 AM | Updated on Sep 5 2017 3:52 PM

హరితహారంలో ఈసారి ఇళ్లలో పెంచే మొక్కలకే అధిక ప్రాధాన్యతనిచ్చారు.



సాక్షి, హైదరాబాద్‌:
తులసి, కరివేపాకు, కలబంద, బంతి, చామంతి, క్రోటన్స్, మందార, ఫౌంటెన్‌ గ్రాస్, సైకస్, ఫైకస్, గన్నేరు, జామ.. ఇలా ఇళ్లలో పెంచుకునే మొక్కలు ఈసారి హరితహారం కార్యక్రమంలో పంపిణీకి సిద్ధమయ్యాయి. నగర వ్యాప్తంగా బుధవారం హరితహారం కార్యక్రమం ప్రారంభమైంది. గత సంవత్సరం రహదారుల వెంట.. ఖాళీ స్థలాల్లో.. నీడనిచ్చే వృక్షాల మొక్కలను అధిక సంఖ్యలో నాటినప్పటికీ, వాటిని సంరక్షించే వారు కరువైన నేపథ్యంలో ఈసారి ఇళ్లలో పెంచే మొక్కలకే అధిక ప్రాధాన్యతనిచ్చారు.

గ్రేటర్‌లోని కోటి మొక్కల్లో 93.72 లక్షల మొక్కలు ఇళ్లకే పంపిణీ చేసేందుకు నిర్ణయించిన జీహెచ్‌ఎంసీ అందుకు అనుగుణంగా ఇళ్లలో పెంచే మొక్కలనే భారీ సంఖ్యలో అందుబాటులో ఉంచింది. ఎవరింట్లో మొక్కను వారు శ్రద్ధగా కాపాడతారనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకుంది. మొక్కల పంపిణీకి అన్ని డివిజన్లలో ముఖ్య ప్రదేశాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కోరిన వారందరికీ లేదనకుండా మొక్కలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతిఇంట్లో మొక్కలు నాటాలనేదే లక్ష్యమన్నారు. మొక్కలు ఇచ్చిన వారి పేర్లు, ఆధార్‌ వివరాలు కూడా సేకరించనున్నట్లు తెలిపారు. తద్వారా మొక్కలు దుబారా కాకుండా ఉంటాయన్నారు. గోడలపై పెరిగే గ్రీన్‌కర్టెన్స్‌కు కూడా ఈసారి ప్రాధాన్యమిచ్చారు.

తొలిరోజే 1.99 లక్షల మొక్కలు ..
హరితహారం ప్రారంభం రోజునే గ్రేటర్‌లోని 141 ప్రధాన ప్రాంతాల్లో 1,95,700 లక్షల మొక్కలు నాటడంతోపాటు పలువురికి ఉచితంగా పంపిణీ చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ తెలిపారు. పలు స్వచ్చంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలు, యువజన సంఘాలు, జీహెచ్‌ఎంసీ వార్డు కమిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. పలు కాలనీలలో నాటిన మొక్కల పరిరక్షణకు ట్రీగార్డ్‌లను స్వచ్ఛందంగా అందజేశారని పేర్కొన్నారు.

దేశమంతా 50 కోట్ల మొక్కలు.. ఒక్క రాష్ట్రంలోనే 47 కోట్లు: కేటీఆర్‌
నగరంలోని వెస్ట్‌జోన్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో మొక్కలు నాటిన మునిసిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ.. దేశంలోని 28 రాష్ట్రాల్లో వెరసి 50 కోట్ల మొక్కలు నాటుతుండగా, ఒక్క తెలంగాణలోనే ఈ సంవత్సరం 47 కోట్ల మొక్కలు నాటుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పచ్చదనం శాతాన్ని పెంపొందించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. గ్రేటర్‌ నగరంలో ఎస్సార్‌ఎస్పీ ప్రాజెక్టులో భాగంగా ఆయా ప్రాంతాల్లో తొలగించే చెట్టను వేరే ప్రాంతాల్లో తిరిగి ట్రాన్స్‌లొకేట్‌ చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement