'మాజీ సీఎం, మంత్రులకు ముడుపులిచ్చాం'

'మాజీ సీఎం, మంత్రులకు ముడుపులిచ్చాం'


వాషింగ్టన్: సంచలనం రేపిన నీటి ప్రాజెక్టుల్లో ముడుపుల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అమెరికా కేంద్రంగా నడుస్తోన్న లూయీస్ బెర్గర్ అనే నిర్మాణ సంస్థ.. గోవాలో నీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ఎవరెవరికి ఎంతెత ముడుపులిచ్చిందో ఫెడరల్ కోర్టుకు వెల్లడించింది.


 


ఆ సంస్థ ప్రతినిధులు  రిచర్డ్ హిర్ష్, జేమ్స్ మెక్లాంగ్లు కోర్టుకు చెప్పిన వివరాలను బట్టి.. గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మాజీ మంత్రి చర్చిల్ అలెమోలకు దాదాపు రూ.6 కోట్లు లంచంగా ఇచ్చి లూయీస్ కంపెనీ కాంట్రాక్టులను దక్కించుకుంది.



ఈ కేసుకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నమని, ఎఫ్ఐఆర్ నమోదుకు తగిన ఆధారాలను సేకరించేపనిలో ఉన్నామని గోవా పోలీసులు చెప్పారు. 2009లో గోవాలో నిర్మించతలపెట్టిన భారీ తాగునీటి, సరఫరా, మురుగు నీటి మళ్లింపు ప్రాజెక్టుల్లో ఈ ముడుపుల వ్యవహారం చోటుచేసుకుంది. కాగా, మాజీ సీఎం కామత్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేస్తున్నారు.



కుంభకోణం వెలుగులోకి వచ్చిందిలా..

న్యూజెర్సీ కేంద్రంగా పనిచేసే లూయీస్ బెర్గర్ కంపెనీ తన వార్షిక పద్దుల్లో 'కమిట్మెంట్ ఫీజు', 'మార్కెటింగ్ ఫీజు', 'ఆపరేషన్ నిర్వహణా ఖర్చులు' అనే పేర్లతో పెద్ద మొత్తంలో లెక్కల్లో చూపింది. దీంతో అనుమానం వచ్చిన అక్కడి ఆదాయం పన్ను శాఖ అధికారులు మొత్తం వ్యవహారంపై కూపీలాగగా ముడుపుల విషయం బయటపడింది.


 


కంపెనీ ప్రతినిధులైన రిచర్డ్ హిర్ష్, జేమ్స్ మెక్లాంగ్లు విచారణలో నేరం అంగీకరించడంతో కోర్టు వారికి 17.1 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. మొదట లంచం తీసుకున్న వివరాలను వెల్లడించడానికి కోర్టు నిరాకరించినప్పటికీ తర్వాత ఆ విషయాలన్నీ బహిర్గతమయ్యాయి. బెర్గర్ సంస్థ ప్రతినిధులకు విధించే శిక్షలకు సంబంధించి నవంబర్లో తుది తీర్పు వెలువడనుంది. ఈ కంపెనీకి హైదరాబాద్ నగరంలోనూ ఓ కార్యాలయం ఉడటం గమనార్హం.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top