‘ఇంటి నుంచి పని’కి ఇక సెలవ్!

‘ఇంటి నుంచి పని’కి ఇక సెలవ్!


న్యూఢిల్లీ: అబ్బ ఇంత పొల్యూషన్‌లో ఆఫీస్‌కు అంత దూరం ఏ వెళ్తాం.... ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చుని హాయిగా పనిచేసుకోవచ్చు. ఇది ఒకప్పటి మాట. అవుటాఫ్ హోమ్ అయితేనే ఆలోచనలు పెరుగుతాయి. ఇది నేటి మాట. అవును.. కొన్ని బహుళ జాతి కంపెనీల ఉద్యోగులు ఇంటినుంచి పనిచేయడానికే ఇష్టపడుతున్నా...సొంతగా ఇంటినుంచి వ్యాపారాలు చేస్తున్న వారు మాత్రం పనిచేసే చోటు వేరొకరితో పంచుకోవడానికే ఇష్టపడుతున్నారు. సోనీ అనే వ్యక్తి కో-వర్కింగ్ స్పేస్ అనే కాన్సెప్ట్‌ను కనిపెట్టారు. వివిధ ఉద్యోగాలు చేసే వారు ఒకే ఆవరణలో తమ ఆఫీసులను ఏర్పాటు చేసుకోవడం కో-వర్కింగ్ స్పేస్ విధానం. కన్నాట్ పేస్ల్‌లో నాలుగు నెలల కిందట భావసారూప్యం ఉన్న వ్యక్తులతో కలిసి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకరి ఉద్యోగంతో ఇంకొకరితో సంబంధం ఉండదు. అయినా ఒకరి విజయాన్ని మరొకరు పంచుకుంటారు. ఒకరు వెనుకబడితే మరొకరు వెన్ను తడతారు. ఇంటినుంచి పని చేయడంలో ఏం లాభముంది? ఇలా పనిచేసే చోటు ఇతరులతో పంచుకోవడం వల్ల ఎక్కువగా నేర్చుకోగలుగుతున్నాను అంటున్నాడు సోనీ. ఏదైనా సాధించినప్పడు సంతోషాన్ని పంచుకునేవారు, పోగొట్టుకున్నప్పుడు మన వెన్నంటే ఉండేవారు ఈ వర్క్ స్పేస్ షేరింగ్ వల్లే దొరుకుతారు అంటున్నాడు మరో సంస్థ యజమాని ప్రణవ్ భాటియా. సోనీలాంటి యువ వ్యాపారవేత్తలు, ఫ్రీలాన్సర్ల సంఖ్య పెరుగుతోంది. సొంతగా సంస్థలు ప్రారంభిస్తున్న వీరు ఆఫీసుల నుంచి కాకుండా కో-వర్కింగ్ స్పేస్ ద్వారా పనిచేయడానికే ఇష్టపడుతున్నారు. కార్యాలయం పంచుకోవడం అనేది దేశ రాజధానిలో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. అయితే ఇలాంటి కార్యాలయాలు ఇప్పటికే బెంగళూరులో నడుస్తున్నాయి. గ్రేటర్ కైలాష్‌లోని మూన్‌లైటింగ్, గుర్గావ్, సరితా విహార్ సమీపంలోని మోహన్ ఎస్టేట్‌ల లో ఉ్న 91 స్పింగ్‌బోర్డ్, కల్కాజీలోని ద స్టూడియో అనేవి నగరంలో కొత్తగా వెలసిన కో వర్కింగ్ స్పేస్‌లు. ఇక్కడ నెలసరి ఛార్జీ 4,500నుంచి 7,500వరకు ఉంటోంది. అయితే కార్యాలయ క్యాబిన్స్ వేరువేరుగా ఉన్నా.. కేఫ్టేరియా, సమావేశ మందిరాలు, వినోదం కలిగించే గదులు, లాంజ్ ఏరియా, పరిపాలనా  విభాగం, టెక్నికల్ సపోర్టువంటివన్నీ అన్ని ఆఫీసులకు కలిసే ఉంటాయి. వీరంతా కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు.
 కో-వర్కింగ్ స్పేస్ ఆలోచన ఆర్థికంగా కలిసొస్తుంది. దీనివల్ల ఉద్యోగులను తగ్గించుకోవడమే కాకుండా నిధుల కొరత నుంచి కూడా బయటపడొచ్చని అంటున్నారు ప్రియాంకా ప్రభాకర్. ఈ కాన్సెపట్‌తోనే ఏర్పాటైన ద స్టూడియో చిన్న ఆవరణ. ఎనిమిది మంది మాత్రమే ఉంటారు. ఇందులో ఆర్టిస్టులు, బ్లాగర్లు, ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. పనిచేసే చోటును పంచుకోవడమనేది చాలా శక్తినిస్తుంది. దీనివల్ల బంధాలు పెరగడమే కాదు... వ్యాపారం వృద్ధి చెందుతుందంటున్నారు 91స్ప్రింగ్‌బోర్డ్‌లోని వరుణ్ చావ్లా. ఇంటినుంచి పనిచేయడం కంటే వర్కింగ్ స్పేస్ పంచుకోవడం కాన్సెప్ట్ వల్ల క్రమశిక్షణ కూడా పెరుగుతుందంటున్నారు ఆయన. గత ఏడాది ఆగస్టులో ప్రారంభమైన స్టిర్రింగ్ మైండ్స్ కార్యాలయంలో మొత్తం 21 సంస్థలున్నాయి. 53 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ తరహా విధానం క్రమేపీ దేశంలోని వివిధ నగరాలకు కూడా విస్తరించే అవకాశాలు కూడా మెండుగానే కనిపిస్తున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top