
సాక్షి, సిటీబ్యూరో: గేటెడ్ కమ్యూనిటీల్లో నివాసం ఉండే ఐటీ ఉద్యోగులకు నిర్మాణ సంస్థలు సరికొత్త సౌకర్యం అందుబాటులోకి తెస్తున్నాయి. కరోనాతో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఉద్యోగుల ఆసక్తి, నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం, మెరుగైన ఉత్పాదకత కారణంగా కొన్ని బహుళ జాతి కంపెనీలు ఇప్పటికీ ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి.
అయితే ఇంట్లో ప్రత్యేకంగా కొంత స్పేస్‌ను ఆఫీస్ కోసం వినియోగిస్తే గృహ కొనుగోలుదారులు ఒప్పుకోవడం లేదు. ఇంట్లో పిల్లల అల్లరి, పెద్దల అవసరాలు, బంధువులు వచ్చినప్పుడు హడావుడి తదితర కారణాలతో ఇంట్లోనే ఆఫీస్ స్పేస్ ఇస్తే ఇబ్బందికరంగా ఉంటోందని ఉద్యోగులు భావిస్తున్నారు. దీంతో నిర్మాణ సంస్థలు గేటెడ్ కమ్యూనిటీల్లోని క్లబ్‌హౌస్‌ల్లో ప్రత్యేకంగా కో–వర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉంచుతున్నాయి.
హై నెట్‌వర్క్ స్పీడ్‌తో వైఫై సేవలను అందిస్తున్నాయి. కూర్చునేందుకు వీలుగా మంచి కుర్చీలు, ఇతరత్రా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఆయా నివాస సముదాయాల్లో వర్క్ ఫ్రం హోమ్ చేసే ఉద్యోగులందరూ ఒకేచోట పనిచేసుకునే వీలు కలుగుతుంది. పైగా అత్యవసర సమయంలో వెంటనే ఇంటికి చేరుకోవచ్చు.
వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న భవన నిర్మాణ సముదాయాలతో హైదరాబాద్ అర్బన్ జంగిల్‌గా మారిపోతుంది. దీంతో ఆ ఉద్యోగులకు పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం అనుభూతి కలిగించాలంటే ల్యాండ్ స్కేపింగ్ అనివార్యమైపోయింది. కనుచూపు మేర వరకూ పచ్చదనం, అది కూడా సేఫ్టీ, సెక్యూరిటీ ఉండే గేటెడ్ కమ్యూనిటీలోనే ఉండాలని నేటి గృహ కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. పురుగు మందులు, రసాయనాలతో గాలి, నేల కాలుష్యం అవుతుంది. దీంతో సేంద్రియ, సస్టయినబుల్ గార్డెనింగ్‌కు ఆదరణ పెరుగుతోంది.
సువాసన, అకర్షణీయమైన పువ్వుల మొక్కలు, చెట్లు, గడ్డితో నివాస సముదాయంలో వాక్, రన్ వేలు, డెక్‌లు, టెర్రస్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ స్కేపింగ్‌లను చేపడుతున్నారు. విశ్రాంతి తీసుకోవడానికి, సమావేశాల కోసం వినూత్న లైట్లతో ప్రత్యేకమైన థీమ్‌లతో అందంగా అలంకరిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ల్యాండ్ స్కేపింగ్‌తో బార్బిక్యూ వంటి ఔట్‌డోర్ ఈవెంట్లు, పార్టీలను చేసుకునేందుకు ఆహ్లాదకరమైన వేదికగా ఉంటుంది.