
ఇటాలియన్ పేరిట వివిధ దేశాల మార్బుల్స్ విక్రయాలు
తెలుసుకుని కొనుగోలు చేస్తేనే ఇంటికి అందం
ఇటాలియన్‌తో సమానంగా మార్కెట్‌లో స్పెయిన్, పోర్చుగల్ మార్బుల్స్
చైనా.. టర్కీ మార్బుల్స్‌లో నాణ్యత తక్కువే..
అందమైన సొంతింటి కల.. కల కాకూడదంటే ఇంటి నిర్మాణ సమయంలో మనం వేసే అడుగులు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా ఇంటి అందాన్ని తళుక్కుమనిపించే ఇటాలియన్ మార్బుల్స్ విషయంలో తప్పటడుగులు వేసి నిట్టూర్చే కన్నా దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే మీ అందమైన ఇల్లు జిగేల్‌మంటూ మెరిసిపోవడం ఖాయం. – శంషాబాద్
విదేశీ మార్బుల్ దిగుమతిలో ప్రథమస్థానం ఇటలీ నుంచి వచ్చే ఇటాలియన్ మార్బుల్‌దే.. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక దేశాల మార్బుల్స్‌ను ఇటాలియన్ పేరుతో విక్రయిస్తున్నారు. అందుకే ఇటాలియన్‌లో ఉన్న ప్రధాన రకాల గుర్తించి తెలుసుకోవాలి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నవి సత్వారియో ఇందులో(తెలుపు, గ్రే), కరారా, వెనటినో, గ్రేవిలియం వీటితో పాటు పాత రకాలైన డైనా, పర్లాటో, బోటోచినోతో పాటు ఔట్‌సైడ్ ఎలివేషన్‌కు మాత్రమే ఉపయోగపడే ట్రావెటైన్ రకాలున్నాయి.
నాణ్యత గుర్తించడం ఎలా..?
ఇంటికి కచ్చితంగా ప్రీమియం బ్రాండ్ ఎంచుకోవడమే ఉత్తమం.. ప్రీమియం బ్రాండ్‌లో కొనుగోలు చేసే ముందు తీసుకునే మార్బుల్ కచ్చితంగా స్క్వార్ ఆకారంలోనే ఉండాలి. అంతేకాకుండా 18ఎంఎం–20ఎంఎం మందం ఉండాలి. రాయికి నాలుగు వైపులా వ్యాకూమ్ చేసిన దాన్ని ఎంచుకోవాలి. రాయి ప్రాసెస్‌లో రెగ్జిన్‌తో చేసిందా లేదా అపాక్సితో చేసిందా అనే విషయం కూడా తెలుసుకోవాలి. సాఫ్ట్ రాయి కంటే హార్డ్ ఉన్న రాయినే ఎంచుకోవాలి. రాయిలో కెమికల్ ఫిల్లింగ్ ఉంటే కచ్చితంగా తక్కువ క్వాలిటీదిగా గుర్తించాలి. ఇటాలియన్ మార్బుల్స్‌లో కనిష్టంగా రూ.300 ఫీట్ మొదలుకొని గరిష్టంగా రూ.5 వేల వరకు హైదరాబాద్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
పోటీగా ఉన్నవి ఇవే..
మార్కెట్‌లో ఇటాలియన్‌తో సమానంగా స్పెయిన్ మార్బుల్స్ పోటీలో ఉన్నాయి. ఇందులో బెల్లాచినో, హర్మానివైట్, గ్రేకార్నికో, స్పానిషన్‌బెజ్, స్పానిష్ బ్రౌన్, పోర్చుగల్‌కు చెందిన మెకలాంజిలో మార్బుల్స్ అధికంగా విక్రయాలు జరుగుతున్నాయి. వీటితో పాటు గ్రీస్‌కు చెందిన ఒలకాస్, గోర్టెన్ ఇన్‌స్పైడర్, థాసోస్‌వైట్ కూడా ఉన్నాయి. వియత్నాంకు చెందిన వైట్ మార్బుల్స్ కూడా ప్రత్యేకంగా పూజ గదులకు ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక బ్రెజిల్‌కు చెందిన క్వార్టజైట్ రాళ్లు టేబుల్ టాప్, కిచెన్, క్లాడింగ్, ఎలివేషన్ ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. వీటితో పాటు మార్కెట్‌లో ఇరాన్, ఇరాక్, తునేషియా సంబంధిత దేశాల మార్బుల్స్ కూడా ఉన్నాయి.
చైనా.. టర్కీ..
చైనా వివిధ దేశాల మార్బుల్స్‌ను దిగుమతి చేసుకుని తిరిగి ప్రాసెస్ చేసి విక్రయించే రకాలు కూడా ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్నాయి. ఇందులో ప్రీమియంతో పాటు మీడియం క్వాలిటీ రకాలు కూడా ఉన్నాయి. టర్కీ నుంచి వచ్చే మార్బుల్స్ కొంత తక్కువ నాణ్యతతో ఉంటున్నాయి. క్రాక్ ఫిల్లింగ్, అధికంగా కెమికల్ ప్రాసెస్ చేసిన మార్బుల్స్ ఉంటాయి. వీటి రీ పాలిష్ మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో.. సొంతింటిలో మీ అడుగులు అందమైన మార్బుల్స్‌పై వేసే ముందు ఈ జాగ్రత్తలు తీసుకుంటే బెటర్.. ఆల్ ది బెస్ట్..!