
ఇంటి స్థలం ఎలా ఎంచుకోవాలి.. నిర్మాణానికి ముందు ప్లాటును ఎలా పరీక్షించుకోవాలన్నది ఇదివరకటి కథనాల్లో చూశాం.. ఇప్పుడు పునాదికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. ఇంటి నిర్మాణం అనేది కేవలం ఒక ఆస్తి నిర్మాణం మాత్రమే కాదు.. ఇది తరాల వారసత్వానికి బలమైన ఆధారం. ఈ నిర్మాణంలో అత్యంత కీలకమైన దశ ఫౌండేషన్. పునాది బలంగా లేకపోతే, ఎంత అందమైన నిర్మాణమైనా కాలక్రమంలో బీటలు పడే ప్రమాదం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో భౌగోళిక పరిస్థితులు, మట్టి స్వభావం, నీటి మట్టం వంటి అంశాలు ఫౌండేషన్ ఎంపికపై ప్రభావం చూపుతాయి. అందుకే, ప్రతి ఇంటి నిర్మాణానికి ముందు మట్టి పరీక్ష (soil test) చేయడం తప్పనిసరి. ఇది భవనం బరువును మట్టి తట్టుకోగలదా అనే విషయాన్ని నిర్ధారిస్తుంది.
సాంప్రదాయ ఫౌండేషన్ పద్ధతులు
ఇప్పటికీ చాలా మంది ఇండివిడ్యువల్ ఫుటింగ్ లేదా స్ట్రిప్ ఫౌండేషన్ వంటి సాంప్రదాయ పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇవి చిన్న స్థాయి గృహాలకు అనువైనవి. ఇండివిడ్యువల్ ఫుటింగ్ పద్ధతిలో ప్రతి పిల్లర్ కింద ప్రత్యేకంగా ఫుటింగ్ వేసి, భవన బరువును సమంగా పంపిణీ చేస్తారు. స్ట్రిప్ ఫౌండేషన్ పద్ధతిలో గోడల వెంట కాంక్రీట్ స్ట్రిప్ వేసి, గోడల బరువును మట్టిలోకి పంపిస్తారు.

అయితే, మట్టి బలహీనంగా ఉన్న చోట రాఫ్ట్ ఫౌండేషన్ లేదా పైల్ ఫౌండేషన్ అవసరం అవుతుంది. రాఫ్ట్ ఫౌండేషన్‌లో మొత్తం భవనానికి ఒకే పెద్ద ఆర్‌సీసీ స్లాబ్ వేసి, బరువును సమంగా పంపిస్తారు. పైల్ ఫౌండేషన్‌లో లోతైన కాంక్రీట్ పైల్స్ వేసి, భారం లోతుగా ఉన్న బలమైన మట్టికి చేరేలా చేస్తారు. ఇవి ఖర్చుతో కూడుకున్నవే అయినా, భద్రతకు మిన్న.

కొత్త పద్ధతులు
ఇటీవల కాలంలో ప్రీకాస్ట్ ఫౌండేషన్ బ్లాక్స్ అనే పద్ధతి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఫ్యాక్టరీలో తయారైన ఫౌండేషన్ బ్లాక్స్‌ను నిర్మాణ స్థలానికి తీసుకెళ్లి అమర్చడం వల్ల నిర్మాణ వేగం పెరుగుతుంది. కార్మిక వ్యయం తగ్గుతుంది. మెటీరియల్స్ వేస్టేజ్ తగ్గుతుంది. మరో కొత్త పరిష్కారం జియోపాలిమర్ కాంక్రీట్ ఫౌండేషన్. ఇది సాంప్రదాయ సిమెంట్‌కు ప్రత్యామ్నాయంగా ఫ్లై యాష్, స్లగ్ వంటి పారిశ్రామిక వ్యర్థాల ఆధారంగా తయారవుతుంది. ఇది తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తుంది. పర్యావరణానికి మేలు చేస్తుంది. పట్టణ ప్రాంతల్లో రెట్రోఫిట్ అవసరమైన చోట మైక్రోపైల్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఇది చిన్న వ్యాసం గల పైల్స్ ద్వారా భవనాన్ని రీఇన్‌ఫోర్స్ చేయడం ద్వారా భద్రతను పెంచుతుంది.

ఖర్చుల అంచనా
ఒక సాధారణ 1000 చ.అ.ఇంటి నిర్మాణానికి ఫౌండేషన్ ఖర్చు రూ.3.7 లక్షల నుండి రూ.5.9 లక్షల వరకు ఉండొచ్చు. ఇందులో మెటీరియల్స్, కార్మికుల వ్యయం, సాయిల్ టెస్టింగ్, నిర్మాణ డిజైన్ ఖర్చులు ఉంటాయి. ప్రస్తుత మార్కెట్‌లో ఒక బ్యాగు సిమెంట్ ధరలు రూ.350–రూ.400, స్టీల్ కేజీ రూ.60–రూ.70, ఇసుక ఇక క్యూబిక్ అడుగుకు రూ.40–రూ.60 మధ్య ఉన్నాయి. ఈ ధరలు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. అందుకే, నిర్మాణానికి ముందు స్థానిక కనస్ట్రక్టర్ లేదా స్ట్రక్చరల్ ఇంజినీర్ సలహా తీసుకోవడం మంచిది.
ఇదీ చదవండి: ప్లాటుకు పరీక్ష.. పాస్ అయితేనే ఇల్లు!
ఇంటిని నిర్మించడం అంటే భద్రత, మన్నిక, అందం అన్నీ మిళితమైన ప్రక్రియ. పునాది పద్ధతులు కూడా ఈ మారుతున్న అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్నాయి. పర్యావరణ అనుకూలత, నిర్మాణ వేగం, ఖర్చు తగ్గింపు వంటి అంశాలు కొత్త పద్ధతుల అభివృద్ధికి దోహదపడుతున్నాయి. భవిష్యత్తులో త్రీడీ ప్రింటెడ్ ఫౌండేషన్లు, స్మార్ట్ సెన్సర్లతో సాయిల్ మానిటరింగ్ వంటి సాంకేతికతలు కూడా అందుబాటులోకి రావొచ్చు.