
రూ.60 లక్షలలోపు ధర ఉండే ఇళ్లకు ఆదరణ
సామాన్య, మధ్య తరగతి గృహాలకు నేటికీ గిరాకీ
అద్దెను ఈఎంఐగా చెలిస్తే సొంతిల్లు సొంతం
వెస్ట్ హైదరాబాద్ మినహా అన్ని వైపులా ఈ తరహా నిర్మాణాలు
గ్రేటర్‌లో సామాన్యుల సొంతింటి కల రోజురోజుకూ దూరమవుతున్న నేపథ్యంలో పలు నిర్మాణ సంస్థలు వాటిని చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. భూముల ధరలు పెరగడం, నిర్మాణ సామగ్రి, కార్మికుల వ్యయాల భారమవడం వంటి పలు కారణాలతో నగరంలో ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయినా పలు నిర్మాణ సంస్థలు ఇప్పటికీ పశ్చిమ హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో సామాన్య, మధ్యతరగతికి అందుబాటు ధరల్లో గృహాలను నిర్మిస్తున్నాయి. తక్కువ ధర అనో, ప్రీలాంచ్‌లోనో కొనుగోలు చేసి మోసపోకుండా.. కాస్త జాగ్రత్త వహిస్తే సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. -సాక్షి, సిటీబ్యూరో
రెండు బెడ్ రూములు, కిచెన్, హాల్, టాయిలెట్స్‌తో 700–800 చ.అ. విస్తీర్ణంలో ఉండే బడ్జెట్ హోమ్స్‌కు ఇప్పటికీ ఆదరణ ఉంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నేపథ్యంలో హైదరాబాద్‌లో అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లకు గిరాకీ ఉంది. చిన్న వ్యాపారులు, సూపర్‌వైజర్లు, డ్రైవర్లు, మధ్యస్థాయి ఉద్యోగులు వంటి సామాన్య, మధ్య తరగతి వర్గాలు ఎక్కువగానే ఉన్నారు. వీరు తమ సొంతింటి కలను బడ్జెట్ హోమ్స్‌తో తీర్చుకుంటారు. అద్దెకు ఉండే బదులు అదే సొమ్మును నెలవారీ వాయిదా(ఈఐఎం) రూపంలో చెల్లిస్తే సొంతిల్లు సొంతమవుతుందనేది వారి కాన్సెప్ట్. దీంతో రూ.60 లక్షల లోపు ధర ఉండే అందుబాటు గృహాలకు డిమాండ్ పెరిగింది.
బిల్డర్లలో ధరల పోటీ..
2–3 ఏళ్ల క్రితం వరకు కూడా దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే గృహాల ధరలు అందుబాటులో ఉండేవి. కానీ, హైరైజ్ అపార్ట్‌మెంట్లు, ఆధునిక వసతుల కల్పనలో బిల్డర్లు పోటీ పడుతుండటంతో రూ.కోట్లు వెచ్చిస్తేగానీ సొంతింటి కల సాకారం కాని పరిస్థితి. మాదాపూర్, నార్సింగి, నానక్‌రాంగూడ, కోకాపేట వంటి పశ్చిమ హైదరాబాద్ మినహా మిగిలిన మూడు జోన్లలో ఇప్పటికీ సామాన్యులకు రూ.60 లక్షల లోపు ధర ఉండే అఫర్డబుల్ గృహాలు దొరుకుతున్నాయి.
ఏ ప్రాంతాల్లో కొనొచ్చంటే..
ఇబ్రహీంపట్నం, నాగార్జున్‌సాగర్ రోడ్, హయత్‌నగర్, పోచారం, ఘట్‌కేసర్, కీసర, శామీర్‌పేట వంటి ప్రాంతాల్లో బడ్జెట్ హోమ్స్ కొనుగోలు చేయవచ్చు. ఔటర్ లోపల ఉండే నివాస ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో ఎంపిక చేసుకోవడం ఉత్తమం. దీంతో ఇల్లు చిన్నగా అనిపించినా, చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది.
కొనే ముందు వీటిని పరిశీలించాలి
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ వంటి విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు, రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్ట్‌లలోనే కొనుగోలు చేయాలి.
ప్రమోటర్లు, బిల్డర్ల పాత చరిత్ర చూడాలి.
ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే ఆర్థిక శక్తి నిర్మాణ సంస్థకు ఉందో లేదో పరిశీలించాలి.
రోడ్డు, విద్యుత్, మంచినీటి సరఫరా వంటి మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు చేయడం ఉత్తమం.
బడ్జెట్ హోమ్స్ ప్రాజెక్ట్‌లకు సమీపంలో విద్యాసంస్థలు, ఉపాధి అవకాశాలు ఉన్న ప్రాంతాలను ఎంచుకోవడం బెటర్.