
అంతర్జాతీయ మెచ్యూరిటీ సూచీలో స్థానం
కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: భారత కో–వర్కింగ్ స్పేస్ మార్కెట్ అంతర్జాతీయ మెచ్యూరిటీ సూచీలో మొదటి స్థానంలో నిలిచినట్టు కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. యూకే, ఫ్రాన్స్, యూఎస్, జపాన్, సింగపూర్ మార్కెట్లను భారత్ వెనక్కి నెట్టేయడం గమనార్హం. ‘ఫ్లెక్సిబుల్ ఆఫీస్‌లో ప్రపంచ ధోరణలు, 2025’ పేరుతో ఈ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘ప్రపంచ వ్యాప్తంగా వివిధ మార్కెట్లలోని మొత్తం ఆఫీస్ స్పేస్‌లో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ భిన్నంగా ఉంది.
కొన్ని అభివృద్ధి చెందిన మార్కెట్లలో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ పెద్ద స్థాయిలో లేదు. అదే కొన్ని వర్ధమాన మార్కెట్లలో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ ప్రొవైడర్లు బలమైన ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు’’అని తెలిపింది. కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ మెచ్యూరిటీ ఇండెక్స్‌లో భారత్ 100 స్కోరు సాధించింది. ప్రపంచంలో పేరొందిన ఆఫీస్ మార్కెట్లు అయిన యూకే 98, ఫ్రాన్స్ 97, యూఎస్ 81, జపా న్, సింగపూర్ 77% స్కోరుతో భారత్ కంటే వెనుకునే ఉన్నాయి. మొత్తం ఆఫీస్ స్పేస్ పరిమాణంలో ఫ్లెక్సిబుల్ స్పేస్ (అన్ని వసతులతో, కోరుకున్నన్ని రోజులకు అద్దెకు లభించేది) ఎంతుంది? ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ ప్రొవైడర్ల సంఖ్య ఆధారంగా కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ ఈ నివేదికను రూపొందించింది.
79.7 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ
భారత్‌లోని టాప్–8 నగరాల్లో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ 79.7 మిలియన్ చదరపు అడుగులు (ఎస్‌ఎఫ్‌టీ) ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. ‘‘భారత ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ రంగం ప్రపంచంలో పేస్‌సెట్టర్ (విస్తరణ వేగం పరంగా కొత్త ధోరణి)గా నిలిచింది. పరిపక్వత, కార్యాక లాపాల్లో వైవిధ్యం, డిమాండ్‌కు అనుగుణంగా సామర్థ్యం పెంచుకోవడం భారత మార్కెట్‌ను ప్రత్యేకంగా నిలిపింది’’అని పేర్కొంది.