వర్ధమాన మార్కెట్లపై డాక్టర్ రెడ్డీస్ దృష్టి | Dr. Reddy's focus on emerging markets | Sakshi
Sakshi News home page

వర్ధమాన మార్కెట్లపై డాక్టర్ రెడ్డీస్ దృష్టి

Oct 30 2015 1:14 AM | Updated on Sep 3 2017 11:41 AM

వర్ధమాన మార్కెట్లపై డాక్టర్ రెడ్డీస్ దృష్టి

వర్ధమాన మార్కెట్లపై డాక్టర్ రెడ్డీస్ దృష్టి

వర్ధమాన దేశాల్లో వ్యాపార విస్తరణపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న .....

క్యూ2లో రికార్డుస్థాయి ఫలితాలు
26% వృద్ధితో రూ. 722 కోట్ల నికర లాభం
రూ. 3,989 కోట్లకు చేరిన ఆదాయం
వ్యాపార విస్తరణకు విలీనాలపై దృష్టి

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో వర్ధమాన దేశాల్లో వ్యాపార విస్తరణపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. ఇందుకోసం అవసరమైతే ఆయా దేశాల్లోని కంపెనీలను, ప్రాచుర్యం పొందిన బ్రాండ్లను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇందుకోసం ఇప్పటికే బ్రెజిల్, కొలంబియా దేశాల్లో గల అవకాశాలను పరిశీలించడానికి ప్రతినిధులను నియమించినట్లు డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌ఓ) సౌమెన్ చక్రవర్తి తెలిపారు. వర్ధమాన దేశాల్లో 5 నుంచి 10 మిలియన్ డాలర్ల వ్యాపారస్థాయికి చేరుకోవాలన్నా చాలా సమయం పడుతుందని, అందుకే స్థానిక కంపెనీలు, బ్రాండ్ల కొనుగోలుపై దృష్టిసారించినట్లు తెలిపారు. ద్వితీయ త్రైమాసిక ఫలితాలను ప్రకటించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమెరికా, యూరప్ తర్వాత వర్ధమాన దేశాల మార్కెట్లో విస్తరణ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సౌమెన్ చక్రవర్తి తెలిపారు.
 
క్యూ2 లాభం 26 శాతం జూమ్...
 ద్వితీయ త్రైమాసికం(క్యూ2)లో డాక్టర్ రెడ్డీస్ అంచనాలను మించిన ఫలితాలను ప్రకటించింది. ఒక త్రైమాసికంలో రికార్డుస్థాయి ఆదాయాన్ని,  లాభాలను ఆర్జించింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 26 శాతం వృద్ధితో రూ. 574 కోట్ల నుంచి రూ. 722 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఆదాయం 11% వృద్ధితో రూ. 3,588 కోట్ల నుంచి రూ. 3,989 కోట్లకు పెరిగింది. యూరప్ ఆదాయంలో 65%, అమెరికా 32% వృద్ధి నమోదు కావడం, కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదల చేయడం లాభాలు పెరగడానికి ప్రధాన కారణంగా డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ తెలిపారు. సమీక్షా కాలంలో ప్రధానమైన అమెరికా మార్కెట్ ఆదాయం రూ. 1,403 కోట్ల నుంచి రూ. 1,856 కోట్లకు చేరితే, యూరప్ ఆదాయం రూ. 128 కోట్ల నుంచి రూ. 212 కోట్లకు పెరిగింది. ఇక దేశీయ వ్యాపారం 14% వృద్ధితో రూ. 480 కోట్ల నుంచి రూ. 546 కోట్లకు పెరిగింది. రష్యా కరెన్సీ రూబుల్ బలహీనత వల్ల వర్ధమాన దేశాల ఆదాయం 22% క్షీణించి రూ. 849 కోట్ల నుంచి రూ. 662 కోట్లకు తగ్గింది. రూపాయల్లో చూస్తే రష్యా వ్యాపారం తగ్గినట్లు కనిపిస్తున్నా... రూబుల్స్‌లో 11% వృద్ధి నమోదైనట్లు ముఖర్జీ తెలిపారు. ఫలితాల నేపథ్యంలో గురువారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర 2.5% పెరిగి రూ.4,214 వద్ద ముగసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement