
మీడియాపై విరుచుకుపడ్డ ట్రంప్
రిపబ్లికన్స్ పార్టీ అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ మీడియాపై విరుచుకుపడ్డారు.
వాషింగ్టన్: రిపబ్లికన్స్ పార్టీ అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ మీడియాపై విరుచుకుపడ్డారు. సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్ లు హిల్లరీకు మద్దతుగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఆదివారం ఒహియోలోని కొలంబస్ టౌన్ హాల్ లో మాట్లాడిన ఆయన పైవిధంగా స్పందించారు. 'సీఎన్ఎన్' అంటే 'క్లింటన్ న్యూస్ నెట్ వర్క్' అని, న్యూయార్క్ టైమ్స్ నిజాయితీ లేని సంస్థని అన్నారు. రోజు మొత్తంలో ట్రంప్ చెడ్డవాడు అని చెప్పడమే వీటి పని అని అన్నారు.
న్యూయార్క్ టైమ్స్ నిజాయితీ లేకుండా ప్రవర్తిస్తోందని, వాళ్లు నష్టపోతున్నారని, వచ్చే రెండు మూడేళ్లలో ఆ సంస్థ ఉనికిలో ఉండకపోవచ్చని జోస్యం చెప్పారు. కుటిలబుద్ధి కలిగిన హిల్లరీ క్లింటన్ గురించి వీరు గొప్పగా రాస్తున్నారని ఆరోపించారు. సీఎన్ఎన్ కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వడం లేదని, వారు తమ పద్దతిని మార్చుకునే వరకు వారికి ఇంటర్వ్యూలు ఇవ్వబోనని చెప్పారు.
తన ఇంటర్వ్యూల కోసం వారు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. వారి పద్ధతిని సక్రమంగా మార్చుకునే వరకూ స్పందించేది లేదని చెప్పారు. తన ఇంటర్వ్యూలు లేకపోవడంతో ఈ మీడియా సంస్థల రేటింగులు కుప్పకూలిపోతున్నాయని అన్నారు. ఫాక్స్ తప్ప అన్ని మీడియా చానెళ్లు తనను టార్గెట్ చేశాయని ఆరోపించారు.
ఫాక్స్ ఒక్కటే కచ్చితమైన సమాచారంతో నడుస్తోందని అన్నారు. ట్రంప్ ప్రచారంలోకి తాజాగా వాషింగ్టన్ పోస్టు తిరిగి రావడంపై ఆయన స్పందించారు. వాషింగ్టన్ పోస్టు ఆలస్యంగా మేల్కొందని అన్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లలో తనకు 22.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారని, ట్విట్టర్ తో ప్రజలకు ఎప్పుడూ చేరువలోనే ఉంటానని అన్నారు. తాను చేసే ట్వీట్లపై మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు.