నగదుంటే మొదట వాటిని కొనేయండి!

నగదుంటే మొదట వాటిని కొనేయండి!

న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై దలాల్ స్ట్రీట్లోని విశ్లేషకులందరూ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతుంటే, ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టరు రాకేశ్ ఝున్ఝున్వాలా మాత్రం బుల్ ఆశలు రేకెత్తిస్తున్నారు. 'నగదు రద్దు అనేది చరిత్ర సృష్టిస్తుంది. ఒకవేళ మీ దగ్గర నగదుంటే, వెళ్లి ఈక్విటీ మార్కెట్లో స్టాక్స్ కొనుగోలు చేయండి' అంటూ పిలుపునిచ్చారు. నిఫ్టీ 50 మళ్లీ తన స్థానాన్ని పునరుద్ధరించుకుంటుందని, కిందకి పడిపోవడం కేవలం పరిమితమేనని చెబుతున్నారు. నిఫ్టీ 8200కి ఎగుస్తుందని పేర్కొంటున్నారు. పెద్ద నోట్ల రద్దు షాక్ నుంచి మార్కెట్లు చాలా త్వరగా సాధారణ స్థితికి వస్తాయని ఝున్ఝున్వాలా అభిప్రాయపడుతున్నారు. 

 

దేశీయంగా పెద్ద నోట్ల రద్దు, అంతర్జాతీయంగా అనూహ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం వంటి వాటివల్ల ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. అంతేకాక ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లను పెంచడం వల్ల కూడా విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోయాయని అన్నారు. కానీ పెద్ద నోట్ల రద్దు చరిత్రను సృష్టిస్తుందని తెలియగానే, ఎఫ్ఐఐల ట్రెండ్ రివర్స్ అయిందన్నారు. సానుకూలమైన కేంద్ర బడ్జెట్ మార్కెట్లు పైకి ఎగియడానికి దోహదం చేస్తుందని ఝున్ఝున్వాలా ఆశిస్తున్నారు. వచ్చే బడ్జెట్లో ఎలాంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుందని తాను భావించడం లేదన్నారు.

 

పీఎస్యూ బ్యాంకుల స్థానాన్ని ప్రైవేట్ రంగ షేర్లు లాగేసుకుంటాయని, ప్రజలు సొరుగుల్లో దాచిన నగదును బ్యాంకుల్లోకి మార్చే సమయం ఆసన్నమైందన్నారు. గత  ఆరేళ్లుగా చెత్త పనితీరును కనబరుస్తున్న ఫార్మా రంగంలో కొనుగోలు మద్దతు లభించిందన్నారు. తను కలిగి ఉన్న షేర్లలో ఇండిగో బేరిస్ ట్రెండ్ను చూస్తుందనుకోవడం లేదని, పెద్ద నోట్ల రద్దు టైటాన్ను మరింత పాజిటివ్గా మారుతుందని విశ్వసిస్తున్నట్టు చెప్పారు. 

 
Back to Top