ఖర్చులకు డబ్బు ఇవ్వలేదని ఓ కూతురు కన్న తండ్రినే దారుణంగా హతమార్చింది. వృద్ధుడని కూడా చూడకుండా కర్రతో మోది ఈ ఘాతుకానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో జరిగింది.
సాక్షి, హైదరాబాద్: ఖర్చులకు డబ్బు ఇవ్వలేదని ఓ కూతురు కన్న తండ్రినే దారుణంగా హతమార్చింది. వృద్ధుడని కూడా చూడకుండా కర్రతో మోది ఈ ఘాతుకానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన కె.వెంకయ్య(55) 20 ఏళ్ల కింద నగరంలోని రామంతాపూర్ వాసవినగర్‌కు వలసవచ్చాడు. ఇక్కడి ఒక రెస్టారెంట్‌లో పనిచేసేవాడు. కుమార్తె అరుణ గొడవల కారణంగా భర్త నుంచి విడిపోయి, పిల్లలతో సహా కలసి తండ్రి వద్దే ఉంటోంది. వారంతా ఇటీవల ఒక శుభకార్యం కోసం ఒంగోలు వెళ్లి వచ్చారు.
అప్పటి నుంచి తండ్రి, కుమార్తె మధ్య డబ్బుల విషయంగా గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయమై శనివారం వారి మధ్య వివాదం ముదిరింది. అరుణ తనకు డబ్బు ఇవ్వాలని కోరగా.. వెంకయ్య నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన అరుణ కర్రతో వెంకయ్యపై దాడి చేసింది. ఆ దెబ్బలకు తాళలేక వెంకయ్య కొద్ది సేపటికే మృతి చెందాడు. వెంకయ్య కుమారుడు ఏడు కొండలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అరుణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.