సాధారణ పరిపాలనా వ్యవస్ధల అవసరాలు, చట్ట సభలకు సంబంధించిన కార్యకలాపాలు భిన్నంగా ఉంటాయని తదనుగుణంగా తాత్కాలిక శాసనసభ రూపుదిద్దుకోవలసి ఉందని రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేసారు.
హైదరాబాద్ :సాధారణ పరిపాలనా వ్యవస్ధల అవసరాలు, చట్ట సభలకు సంబంధించిన కార్యకలాపాలు భిన్నంగా ఉంటాయని తదనుగుణంగా తాత్కాలిక శాసనసభ రూపుదిద్దుకోవలసి ఉందని రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేసారు. కేవలం శాసనసభ నిర్మాణం మాత్రమే కాకుండా దాదాపు 200 మంది ఉద్యోగులు సభ అవసరాలకు అనుగుణంగా పనిచేయగలిగే వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. మంగళవారం స్పీకర్తో సీఆర్డీఏ అధికారులతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా వెలగపూడిలో ఇప్పటికే రూపొందించిన శాసనసభ నిర్మాణ నమూనాను పరిశీలించిన సభాపతి సభ నిర్వహణకు కావలసిన వసతుల గురించి చర్చించారు. తాత్కాలికమే అయినా ప్రస్తుతం వెలగపూడిలో చేపట్టే నిర్మాణాలలో అన్ని వసతులు ఉండవవలసిందేనని కోడెల సూచించారు. క్యాంటిన్తో పాటు లైబ్రరీ అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. చట్టసభలకు ప్రధానంగా గ్రంధాలయ అవశ్యకత ఉందని, తదనుగుణంగా విశాలమైన ఏర్పాటు ఉండాలని స్పష్టం చేశారు.
ప్రస్తుతం అటు తెలంగాణకు, ఇటు ఆంధ్రప్రదేశ్ అవసరాలకు వినియోగిస్తున్న శాసనసభ భవనాలకు కూలంకషంగా పరిశీలించాలని, తద్వారా మరింత మెరుగైన వసతులతో తాత్కాలిక సచివాలయం ఎలా నిర్మించాలన్న దానిపై అవగాహనకు రావాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, సీఆర్డీఏ సీనియర్ ఆర్కిటెక్చర్ రాహుల్ తదితరులు పాల్లొన్నారు.