'టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మా పార్టీనే' | Sakshi
Sakshi News home page

'టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మా పార్టీనే'

Published Tue, Jul 28 2015 5:51 PM

'టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మా పార్టీనే' - Sakshi

జనగామ రూరల్ (వరంగల్ జిల్లా): ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన తెలంగాణ ప్రభుత్వంపై పోరాడేందుకు సీపీఎం ప్రత్యామ్నాయంగా మారిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జనగామలో మంగళవారం తెలంగాణ రైతుల  సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే ఎసిరెడ్డి నర్సింహారెడ్డి 24వ వర్ధంతి సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల పోరాటంతోనే నాడు తెలంగాణ రైతుల సాయుధ పోరాటంలో ప్రజలకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కలిగిందన్నారు. సుదీర్ఘ ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఆవిర్భావ వేడుకల్లో ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు సంబరాలు జరుపుకోకపోవడం బాధాకరమన్నారు.  

గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ చోటు చేసుకోని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాలనలోనే అసంతృప్తి మొదలైందని.. దానికి సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నేటికి నెరవేర్చలేదన్నారు. కేంద్రంలో మోదీ సర్కార్‌తో ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి సాధింపు, నిత్యావసర సరుకుల ధరల అదుపు కోసం చేసిన ప్రయత్నాలు శూన్యమన్నారు. వరంగల్ ఎంపీ ఉప ఎన్నికల్లో వామపక్షాల కూటమి నుంచి బలమైన నాయకుడిని అభ్యర్థిగా ప్రకటిస్తామని ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం తెలిపారు.

Advertisement
Advertisement