
తెల్లబంగారం మెరుస్తోంది
పత్తి కళకళలాడుతోంది. ఇప్పటి వరకు తుపాను నష్టాలతో నిరాశలో ఉన్న రైతుకు... పెరిగిన ధర ఊరటనిస్తోంది.
ఖమ్మం గాంధీచౌక్, జడ్చర్ల, జమ్మికుంట- న్యూస్‌లైన్: పత్తి కళకళలాడుతోంది. ఇప్పటి వరకు తుపాను నష్టాలతో నిరాశలో ఉన్న రైతుకు... పెరిగిన ధర ఊరటనిస్తోంది. దిగుబడి తగ్గినప్పటికీ ధర పెరగటంతో ఉపశమనం లభించినట్లయింది. ఏటా సీజన్ ముగిసేటపుడు ధర పెరగటం... అప్పటికే రైతులు తమ దగ్గరున్న పత్తిని అమ్మేయటం మామూలే. ఈసారి మాత్రం సీజన్‌లోనే పత్తి ధర బాగా పెరిగింది. ఖమ్మం మార్కెట్లో క్వింటాల్ పత్తి అత్యధికంగా రూ.5,200 పలికింది. త్వరలో ఇది రూ.6వేల వరకు చేరొచ్చనేది వ్యాపారుల అంచనా.
డిసెంబర్ మొదటి వారం రూ.4,200లు ఉన్న ధర బుధవారం రూ.5,200లకు చేరటం గమనార్హం. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాదేపల్లి మార్కెట్‌లో కూడా పత్తి క్వింటాలుకు గరిష్టంగా రూ.5072, కనిష్టంగా రూ.4209 పలికింది. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడి పత్తి మార్కెట్‌కు ఐదువేల క్వింటాళ్ల పత్తి ఒకేరోజు విక్రయానికి రావడంతో ఆవరణమంతా బస్తాలతో నిండిపోయింది. ఇక్కడ ఇంత ధర రావటం ఈ సీజన్లో ఇదే తొలిసారి. ప్రభుత్వం పత్తికి గరిష్టంగా రూ.4000, కనిష్టంగా రూ.3800 మద్దతుధరలు నిర్ణయించడం గమనార్హం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో సైతం బుధవారం పత్తికి రికార్డు ధర పలికింది. క్వింటాల్‌కు రూ.5,090 పలకటం ఈ సీజన్లో ఇప్పటిదాకా లేదు. అంతర్జాతీయ మార్కెట్లో బేళ్లు, గింజలు, దారానికి డిమాండ్ వస్తుండడంతో ధర అధికంగా పలుకుతున్నట్లు వ్యాపారులు చెప్పారు. మూడు రోజులుగా క్వింటాల్‌కు రూ.5 వేల లోపు పలికిన ధరలు బుధవారం రూ.5 వేలు దాటడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో స్వీట్లు పంచారు కూడా.
గింజలకూ డిమాండ్...
పత్తి గింజలకున్న డిమాండ్ వల్లే ధర అమాంతం పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. పత్తిని జిన్నింగ్ మిల్స్ కొనుగోలు చేసి, పత్తి నుంచి గింజను వేరు చేస్తాయి. గింజల నుంచి ఆయిల్ తీస్తారు. దాణాలోనూ వీటిని వాడతారు. అందుకే వీటిక్కూడా డిమాండ్ బావుంది. గతంలో క్వింటా గింజల ధర రూ.1450 ఉండగా, ప్రస్తుతం రూ.1700 పలుకుతోంది. కాగా వాతావరణం అనూకూలించకపోవడం... అధిక వర్షాలు... పంటకు తెగుళ్లు వ్యాపించడం వంటి అనేక కారణాలతో ఈ ఏడాది పంట దిగుబడి తగ్గినట్లు వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల మధ్య దిగుబడి రావాల్సి ఉండగా.. ఈ ఏడాది కేవలం 4 నుంచి 6 క్వింటాళ్ల మధ్యనే వచ్చింది.