
కార్పొరేట్ ఫలితాలతో మార్కెట్ ట్రెండ్..
రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో వంటి బ్లూ చిప్ కంపెనీలు ఈ వారంలో వెల్లడించే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో వంటి బ్లూ చిప్ కంపెనీలు ఈ వారంలో వెల్లడించే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మన స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం గమనం.... తదితర అంశాల ప్రభావం కూడా ఉంటుందని వారంటున్నారు.
ఫలితాలే కీలకం...
ఎలాంటి దేశీయ ప్రధాన సంఘటనలేమీ లేనందున ఈ వారంలో వెలువడే ఆల్ట్రాటెక్ సిమెంట్(ఈ నెల17న-సోమవారం), హిందుస్తాన్ జింక్(బుధ-ఈ నెల19న), రిలయన్స్ ఇండస్ట్రీస్, యస్ బ్యాంక్(గురు-ఈ నెల20న), ఏసీసీ, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కెయిర్న్ ఇండియా(శుక్రవారం-ఈ నెల21న) కంపెనీల ఆర్థిక ఫలితాలు.. స్టాక్ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. పెట్రో ఇంధన ధరల పెంపు నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు వెలుగులోకి వచ్చే అవకాశముందని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు.
క్యూ2 ఫలితాల సీజన్ ప్రారంభమైనందున ఫలితాలు వెల్లడించే కంపెనీలపై ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ డెరైక్టర్ అబ్నిష్ కుమర్ సుధాంశు పేర్కొన్నారు. అమెరికా ఎన్నికలు, యూరోజోన్‌కు సంబంధించిన పరిణామాలపై కూడా ఇన్వెస్టర్ల కన్ను ఉంటుందని వివరించారు. ఇక అంతర్జాతీయంగా చూస్తే అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్, ట్రంప్‌ల మద్య మూడవది, చివరి చర్చా కార్యక్రమం ఈ బుధవారం(ఈ నెల19న) జరగనున్నది. సోమవారం(ఈ నెల17న) అమెరికా సెప్టెంబర్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, బుధవారం(ఈ నెల19న) చైనా క్యూ3 జీడీపీ, ఐఐపీ, రిటైల్ అమ్మకాల సంబంధిత గణాంకాలు వెలువడుతాయి. గురువారం (ఈ నెల 30న) ఈసీబీ గవర్నింగ్ కమిటీ సమావేశం జరగనున్నది.
జోరు తగ్గిన విదేశీ పెట్టుబడులు
ఈ నెల మొదటి రెండు వారాల్లో విదేశీ ఇన్వెస్టర్లు డెట్ మార్కెట్ నుంచి రూ.6,000కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఈ నెల రెండు వారాల్లో స్టాక్ మార్కెట్లో కేవలం రూ.180 కోట్ల నికర పెట్టుబడులు మాత్రమే పెట్టారు. ఆర్‌బీఐ ఇటీవల రేట్ల కోత కారణంగా బాండ్ ఈల్డ్‌లపై ప్రతికూల ఒత్తిడి కారణంగా డెట్ మార్కెట్ ఆకర్షణీయంగా లేదని ఎస్‌ఏఎస్ ఆన్‌లైన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సిద్ధాంత్ జైన్ చెప్పారు.