అధికార టీఆర్‌ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నాయకుడు, నల్లగొండ ఎంపీ గుత్తా...
పార్టీలో చేరిన మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి
నల్లగొండ డీసీఎమ్మెస్ చైర్మన్ కూడా చేరిక
సాక్షి, హైదరాబాద్ : అధికార టీఆర్‌ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నాయకుడు, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సోదరుడు గుత్తా జితేందర్‌రెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల సంఘం (మదర్ డెయిరీ) చైర్మన్‌గా ఉన్న జితేందర్‌రెడ్డి కొందరు డెరైక్టర్లతో కలసి వచ్చి శనివారం ముఖ్యమంత్రి అధికార నివాసంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సన్నిహిత అనుచరుడు, నల్లగొండ డీసీఎమ్మెస్ చైర్మన్ జిల్లేపల్లి వెంకటేశ్వర్ రావు (జేవీఆర్) కూడా సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు కూడా కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి మారనున్నారని, ఆయన శనివారమే చేరాల్సి ఉన్నా, వ్యక్తిగత కారణాలతో రాలేక పోయారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనెల 8వ తే దీన నల్లగొండలో జరగనున్న బహిరంగ సభలో ఆయన గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమంటున్నారు. పాండురంగారావు కూడా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనుచరుడు కావడం గమనార్హం.