రాష్ట్ర వార్షిక బడ్జెట్ తయారీలో కొత్త పంథాను అనుసరిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ఈ కసరత్తులో పాలు పంచుకుంటున్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్ తయారీలో కొత్త పంథాను అనుసరిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ఈ కసరత్తులో పాలు పంచుకుంటున్నారు. శనివారం నుంచి ఆయన శాఖల వారీగా బడ్జెట్‌పై సమీక్ష జరుపనున్నారు. శాఖల ప్రతిపాదనలను పరిశీలించి సంబంధిత కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో ముఖ్యమంత్రి చర్చిస్తారు. వరుసగా రెండు, మూడు రోజులు ఈ సమావేశాలు నిర్వహించి ఈ కసరత్తు పూర్తి చేసే అవకాశాలున్నాయి.
సమీక్షలు ముగిసిన వెంటనే వచ్చే బడ్జెట్‌లో ఎన్ని నిధులు కేటాయిస్తారనేది సంబంధిత శాఖలకు వెల్లడిస్తారు. బడ్జెట్‌లో తమకు నిర్దేశించిన నిధుల ఆధారంగా సంబంధిత శాఖలు జిల్లాలవారీగా బడ్జెట్ ముసాయిదాలు సిద్ధం చేస్తాయి.
రేపే ఈటల ఢిల్లీ పర్యటన
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో శనివారం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర శనివారం ఉదయం ఢిల్లీకి వెళుతున్నారు.