భారత్‌పై చైనా మరో బిత్తిరి వీడియో!

భారత్‌పై చైనా మరో బిత్తిరి వీడియో! - Sakshi


న్యూఢిల్లీ: వ్యంగ్యం పేరిట ఇప్పటికే భారత్‌పై జాతివివక్షాపూరితమైన వీడియోను ప్రసారం చేసిన చైనా అధికారిక మీడియా 'జిన్హుహా'.. తాజాగా మరో బిత్తిరి వీడియోను ప్రసారం చేసింది. అయితే, ఈ వీడియోలో జాతివివక్ష వ్యాఖ్యలు లేకపోవడం గమనార్హం. అంతేకాదు భారత్‌ పట్ల కొంత సామరస్య వైఖరిని ప్రదర్శించే యత్నం ఈ వీడియోలో కనిపించింది. భారత్‌ ప్రపంచంలోనే పురాతన నాగరికత గల దేశమని, అద్భుతమైన సంస్కృతి భారత్‌ సొంతమని వ్యాఖ్యానిస్తూనే.. రెండు నెలలుగా కొనసాగుతున్న డోక్లాం ప్రతిష్టంభనపై చిలుక పలుకులు పలికింది. డోక్లాం వివాదానికి భారతే కారణమని నిందించింది.



'టాక్‌ ఇండియా' పేరిట జిన్హుహా వార్తాసంస్థ ఓ సిరీస్‌ను ప్రసారం చేస్తున్నట్టు ఈ వరుస వీడియోలను బట్టి అర్థమవుతోంది. '7 సిన్స్‌ ఆఫ్‌ ఇండియా' (భారత్‌ ఏడు పాపాలు) పేరిట గతవారం ప్రసారం చేసిన వీడియోలో జాతివివక్షపూరితమైన వ్యాఖ్యలు, వ్యంగ్యం జిన్హుహా అభాసుపాలైంది. ఆ వీడియోలో భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. చైనా యాంకర్‌ సిక్కు మతస్తుడి మాదిరిగా గడ్డం అంటించుకొని భారతీయులను అనుకరించే ప్రయత్నం చేయడం నవ్వుతెప్పించడానికి బదులు వికారం, రోత తెప్పించింది. అంతేకాకుండా భారతే దురాక్రమణ పూరితంగా చైనా భూభాగంలోకి ప్రవేశించిందన్న ఆ దేశ కమ్యూనిస్టు సర్కారు వైఖరిని ఈ వీడియోలోని యాంకర్లు వల్లేవేశారు.



తాజా వీడియోలోనూ అవే వ్యాఖ్యలు, వైఖరి ప్రస్ఫుటం కావడం గమనార్హం. డోక్లాం చైనా భూభాగమని, భారతే తమ భూభాగంలోకి చొరబడిందని చెప్పుకొచ్చింది. చైనాకు చెందిన పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) ఏమాత్రం సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడలేదని నొక్కి చెప్పుకొంది. అయితే, ఈ వీడియోలో భూటాన్‌ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. భారత్‌-భూటాన్‌-చైనా ట్రైజంక్షన్‌లోని డోక్లాం ప్రాంతం భూటాన్‌ది అని, అక్కడ చైనా అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపట్టడం సరికాదని భారత్‌, భూటాన్‌ పేర్కొంటున్న సంగతి తెలిసిందే. అయినా, చైనా మొండిగా తన దురాక్రమణ ధోరణితో డోక్లాం తనదేనని వాదిస్తున్న సంగతి తెలిసిందే.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top