బ్యాంకు రుణం ఎగ్గొట్టారా.. అయితే ఇక అంతే!
బ్యాంకులకు వేల కోట్లలో బాకీలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా అయితే హాయిగా తట్టాబుట్టా సర్దుకుని లండన్ చెక్కేశారు. అదే చైనాలో అయితే మాత్రం ఆయనకు అలా కుదిరేది కాదు.
బ్యాంకులకు వేల కోట్లలో బాకీలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా అయితే హాయిగా తట్టాబుట్టా సర్దుకుని లండన్ చెక్కేశారు. అదే చైనాలో అయితే మాత్రం ఆయనకు అలా కుదిరేది కాదు. ఎందుకంటే.. బ్యాంకులలో అప్పు తీసుకుని ఎగ్గొట్టిన దాదాపు 60 లక్షల మంది విమానాలు ఎక్కి ఎక్కడకూ వెళ్లకూడదని, వాళ్లకు రుణాలు, క్రెడిట్ కార్డులు ఇవ్వకూడదని.. చివరకు ఉద్యోగాల్లో ప్రమోషన్లు కూడా ఇవ్వకూడదని అక్కడి అధికారులు స్పష్టం చేశారు.
చైనా సుప్రీంకోర్టు ఇలా బ్లాక్‌లిస్టు చేసిన వారిలో దాదాపు 67.3 లక్షల మంది పౌరులున్నారు. ఇప్పటివరకు 61.5 లక్షల మందిని విమాన టికెట్లు కొనకుండా నిషేధించగా, అలాగే 22 లక్షల మంది హైస్పీడ్ రైళ్లలో కూడా వెళ్లడానికి వీల్లేదని ఆదేశించారు. 71 వేల మంది అయితే కార్పొరేట్ ప్రతినిధులుగా గానీ, ఎగ్జిక్యూటివ్‌లుగా గానీ పనిచేయడానికి కుదరదు. అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ల ఐడీ కార్డు. పాస్‌పోర్టుల సమాచారాన్ని విమానయాన సంస్థలు, రైల్వే కంపెనీలకు చైనా సుప్రీంకోర్టు అందజేసింది. చైనాలోని అతిపెద్ద వాణిజ్య బ్యాంకులలో ఒకటైన ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా దాదాపు లక్ష వరకు అప్పులు, క్రెడిట్ కార్డుల దరఖాస్తులను తిరస్కరించింది. వీళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, రాజకీయ సలహా కమిటీల సబ్యులు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సభ్యులు కూడా ఉన్నారు.