పదోన్నతిలోనూ వెనుకబాటే | No promotions in SC Development Department | Sakshi
Sakshi News home page

పదోన్నతిలోనూ వెనుకబాటే

Jun 1 2015 5:54 AM | Updated on Sep 15 2018 3:01 PM

షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖలోని ఉద్యోగులు మూడున్నరేళ్లుగా పదోన్నతులు రాక ఉస్సూరుమంటున్నారు.

ఎస్సీ అభివృద్ధి శాఖలో ప్రమోషన్లే లేవు
     పెద్ద సంఖ్యలో ఖాళీలు.. పట్టించుకోని ఉన్నతాధికారులు
     పని భారంతో అల్లాడుతున్న ఉద్యోగులు
     మూడున్నరేళ్లుగా ఇదే పరిస్థితి
 
 సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖలోని ఉద్యోగులు మూడున్నరేళ్లుగా పదోన్నతులు రాక ఉస్సూరుమంటున్నారు. సంక్షేమ శాఖలో ఇదే రకమైన విధులు నిర్వహిస్తున్న ఎస్టీ,బీసీ శాఖల ఉద్యోగులకు ఎప్పటికప్పుడు ప్రమోషన్లను వస్తుండగా, ఎస్సీ శాఖలో మాత్రం పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఈ శాఖకు సంబంధించి మొత్తంగా 10 జిల్లా సంక్షేమాధికారుల (డీఎస్‌డబ్ల్యూఓ) పోస్టులు (మహబూబ్‌నగర్ జిల్లా మినహా, హైదరాబాద్‌లో రెండు పోస్టులు ), 17 అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ఏఎస్‌డబ్ల్యూఓ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పదోన్నతుల విషయమై ఉద్యోగులు ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శికి విన్నవిస్తున్నా పరిస్థితిలో మార్పు లేదు. మూడున్నరేళ్లుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా పదోన్నతులపై కదలిక లేదని ఉద్యోగులు వాపోతున్నారు.
 
 అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, సూపరింటెండెంట్‌లకు 2:1 నిష్పత్తిలో డీఎస్‌డబ్ల్యూఓలుగా ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉండగా, ఇవి పూర్తిగా నిలిచిపోయాయి. ప్రతి జిల్లాలో గ్రేడ్-2 అధికారులను గ్రేడ్-1 అధికారులుగా పదోన్నతులు కల్పించాలి. ఈ ప్రమోషన్లను జిల్లా కలెక్టర్లే చేసేందుకు అవకాశమున్నా, ఇందుకు సంబంధించి ఎస్సీ శాఖ ముఖ్యకార్యదర్శి నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో ఈ పదోన్నతులు కూడా నిలిచిపోయాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 40 గ్రేడ్-1 పోస్టులు ఖాళీగా ఉండగా, డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే 200 గ్రేడ్-2 పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. దీంతో ఉన్న ఉద్యోగుల మీద అదనపు పనిభారం పడుతోంది. దీనికి తోడు హాస్టళ్లలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఏసీబీ అధికారులు దాడులు చేస్తూ తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో పిల్లల సంఖ్య తక్కువగా ఉందని గత ఏడాది ప్రభుత్వం రూ.16 కోట్ల మేర డైట్‌చార్జీలను సరెండర్ చేసిందని ఉద్యోగులు తెలిపారు. నిర్వహణలో పాదర్శకత కోసం ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చినా హాస్టళ్లలో ఇంటర్నెట్ లేక సమాచారాన్ని నెట్ సెంటర్ల నుంచి పంపుతున్నామని, దీంతో నెలకు రూ.వెయ్యి వరకు అదనపు భారం తమ మీదే పడుతోందని జిల్లాల్లోని అధికారులు వాపోతున్నారు. ఇకనైనా తమకు పదోన్నతులు కల్పించి ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement