breaking news
bank defaulters
-
రుణాల ఎగవేతదారులపై ఎందుకంత ప్రేమ?
బ్యాంకులకు రుణాలు పెద్ద ఎత్తున ఎగవేసిన వారి సంఖ్యలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అగ్రభాగాన ఉన్నాయి. డబ్బు ఎగవేసిన వారిని గొప్పగా కీర్తించే పరిస్థితి కూడా వస్తున్నదంటే సమాజం ఎటువైపు పోతోందో ఆలోచించాలి. చిన్నవాడికి ఒక న్యాయం, పెద్దవాడికి మరో న్యాయం అన్న చందంగా వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఒకప్పుడు చిన్న స్కాములకే మీడియాలో గగ్గోలు పుట్టేది. కానీ ఎగవేతదారుల వార్తలను అధికారికంగా ప్రకటించినా ప్రచారం చేయని మీడియాను ఇప్పుడు చూస్తున్నాం. వారు తాము మద్దతు ఇచ్చే పార్టీ కనుక, తమ సామాజికవర్గం కనుక మోసాలను కప్పిపుచ్చుతాం అన్న చందంగా వ్యవహరించడం వికృత పరిణామం. మన దేశంలో వ్యవస్థల తీరు భలే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎవరైనా ఉద్యోగి ఐదువేల రూపాయల లంచం తీసుకుంటే అవినీతి నిరోధక శాఖ వల పన్ను తుంది. కానీ వేల కోట్ల రూపాయలు ఎగవేసినవారిని మాత్రం ఏ సంస్థ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటుంది. అన్నిటికీ, అందరికీ ఇది వర్తిస్తుందని కాదు. చిన్న చేపలు వలకు చిక్కినప్పుడు, పెద్ద చేపలు ఎందుకు పడవన్న ప్రశ్న సామాన్యుడిలో తలెత్తుతుంది. గతంలో కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ చుట్టూరా వందలు, వేల కోట్లు ఎగవేసినవారు దర్జాగా తిరుగుతుండేవారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితి మారుతుందని అనుకున్నవారికి ఆశాభంగమే ఎదురవుతోంది. వేల కోట్లు ఎగవేసినవారు వేరే పార్టీ నుంచి బీజేపీలో చేరి పునీతులు అవుతున్నారు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్న దంటే బ్యాంకులను మోసం చేసో, లేక బ్యాంకులకు రుణాలు పెద్ద ఎత్తున ఎగవేసిన వారో దేశవ్యాప్తంగా చూసుకుంటే గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువమంది ఉన్నారు. తాజాగా కోస్టల్ ప్రాజెక్ట్స్ అనే సంస్థ 4736 కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేసిందన్న సంచలన కథనం కొన్ని ఆంగ్ల పత్రికల్లో ప్రము ఖంగా వచ్చింది. తెలుగు పత్రికలలో గానీ, మరికొన్ని ఆంగ్ల పత్రి కలలో గానీ సంబంధిత వార్త పెద్దగా కనిపించలేదు. అవినీతికి వ్యతి రేకంగా సంపాదకీయాలు రాసే పెద్ద పత్రిక కూడా ఇందుకు అతీతంగా లేకపోవడం విశేషం. రుణాలు ఎగవేసేవారు ప్రధానంగా ప్రభుత్వరంగ బ్యాంకులనే ఎక్కువగా మోసం చేస్తున్నారట. ప్రైవేటు రంగ బ్యాంకులకు రుణబకాయిలు తక్కువగానే పెడుతున్నారట. కోస్టల్ ప్రాజెక్ట్స్ వారిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీబీఐకి ఫిర్యాదు చేసింది. తప్పుడు రికార్డులు తయారు చేయడం, అకౌంట్స్‌లో మోసానికి పాల్పడటం, ఇతర రూపాలలో వీరు బ్యాంకును మోసం చేశారన్నది అభియోగం. సత్యం కంపెనీ అధినేత రామలింగరాజు బ్యాంకుల్లో తమకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లుగా నకీలీ సర్టిఫికెట్లు సృష్టించిన వైనం ఒక దశాబ్దం క్రితం పెను సంచలనం అయింది. ఇప్పుడు ఆయనను మించిన ఘనా పాఠీలు చాలామంది వెలుగులోకి వస్తున్నారు. అందులో మన తెలుగువారిని చూస్తే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు చెందిన సంస్థలు 46 వేల కోట్లకు పైగా బకాయి పడ్డాయి. మరి వాటి గురించి బ్యాంకులు ఏమి చేస్తున్నాయో తెలి యదు. రాజగోపాల్ మాత్రం ఎన్నికల జోస్యాలు చెప్పుకుంటూ దర్జాగా తిరిగేస్తున్నారు. ఈ మధ్యనే జీవీకే కంపెనీ అధినేత జీవీకే రెడ్డి కుటుంబంపై కూడా కేసు నమోదు అయింది. ముంబై విమానాశ్రయా నికి సంబంధించిన కేసు అది. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఏడువేల కోట్లకు పైగా బ్యాంకులకు ఎగనామం పెట్టినట్లు సీబీఐ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న సుజనా చౌదరి కూడా ఆరువేల కోట్లకు పైగా వివిధ బ్యాంకులకు టోపీ పెట్టా రన్న అభియోగాలు వచ్చాయి. తాజాగా ఒక టీడీపీ ఎంపీకి వియ్యంకుడు, అలాగే ఒక టీవీ సంస్థకు యజమాని అయిన వారికి వియ్యంకుడు అయిన కోస్టల్ ప్రాజెక్ట్స్ అధినేత సురేంద్ర 4,736 కోట్లు ఎగ వేసిన తీరు చూస్తున్నాం. ఇంకా ఐవీఆర్సీఎల్, భరణి, భారత్ పవర్, పల్లవి, బృందావన్ మొదలైన సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నా యని సమాచారం. ఎంపీ పదవి కోల్పోయిన కర్ణాటక వ్యాపారవేత్త విజయ్ మాల్యా సుమారు పదివేల కోట్లు, గుజరాత్‌కు చెందిన నీరవ్ మోదీ, చోక్సి వంటివారు వేల కోట్ల ఎగవేతలకు పాల్పడ్డారు. వీరిలో కొందరు విదేశాలకు పారిపోయి క్షేమంగా జీవితాన్ని కొనసాగిస్తు న్నారు. విజయ్ మాల్యా దర్జాగా విమానమెక్కి వెళ్లిపోతుంటే కేంద్ర ప్రభుత్వం, సీబీఐ చోద్యం చూస్తూ కూర్చున్నాయన్న విమర్శలు వచ్చాయి. వీరిలో అనేక మంది బోగస్ కంపెనీలు పెట్టి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను విదేశాలకు మళ్లించారని ఆరోపణలొ చ్చాయి. విజయ్ మాల్యాకు బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో ఆస్తులు ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్ నివాసాలపైన, ఆఫీసులపైన సీబీఐ దాడులు చేసింది. ఆ తర్వాత వారు బీజేపీలో చేరారు. మరో ఇద్దరు టీడీపీ ఎంపీలతో కలిసి వారు మోదీ చాంబర్లో కనిపించడం చూసి అంతా విస్తుపోయారు. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ ఇంటిపై ఆదాయపన్ను శాఖ, సీబీఐ, ఈడీ వంటి సంస్థలు దాడి చేసి, రెండువేల కోట్ల మేర అక్రమాలు జరిగాయని ప్రకటించాయి. అది జరిగి నెలలు గడిచిపోతున్నా, ఆ వ్యవహారం ఏమైందో తెలియదు. స్వయంగా ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వచ్చి పోలవరం ప్రాజెక్టు చంద్ర బాబుకు ఏటీఎం అయిందని ఆరోపించారు. అలాగే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆనాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఖర్చు చేసిన 7,200 కోట్ల రూపాయల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనీ, చెట్టు–నీరు స్కీములో పదమూడువేల కోట్ల అవి నీతి జరిగిందనీ తరచూ ఆరోపించేవారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ వీటిపై విచారణ జరగడం లేదు. అమరావతి భూమి స్కాముపై సీబీఐ దర్యాప్తు కావాలని ఏపీ ప్రభుత్వం కోరినా ఇంతవరకు కేంద్రం స్పందించలేదు. బ్యాంకులకు ఆయా వ్యక్తులు ఎగవేసిన రుణాలను కనుక వసూలు చేయగలిగితే ఈ దేశంలోని ప్రతి పేదవాడికి లక్ష రూపాయల చొప్పున ఇవ్వవచ్చనిపిస్తుంది. మోదీ స్విస్ నుంచి భారత బ్లాక్ మనీని తెచ్చి 15 లక్షల చొప్పున పంచుతానని ఎన్నికలలో చెప్పేవారు. అంత కాకపోయినా, ఈ రకమైన మోసాలను అరికట్టి ఆ డబ్బును పేదలకు పంచినా మేలు జరుగుతుంది. ఇండస్ట్రీస్ సిక్ బట్ నాట్ ఇండస్ట్రియ లిస్ట్స్ అని ఒక నానుడి. పరిశ్రమలు ఖాయిలా పడతాయి కానీ పారి శ్రామికవేత్తలు కాదు. వీరిలో ఎవరైనా నిజంగానే చిత్తశుద్ధితో పనిచేసి, పరిశ్రమల ద్వారా వందలు, వేల మందికి ఉపాధి కల్పించి, పరి స్థితులు అనుకూలించక దెబ్బతిని రుణాలు చెల్లించలేకపోతే దానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించవచ్చు. ఒకప్పుడు కృషి బ్యాంక్, ప్రుడెన్షి యల్ బ్యాంక్ వంటి చిన్న సంస్థలు మూత పడి వేలాది మంది డిపాజిటర్లకు డబ్బు ఎగవేస్తే పెద్ద సంచలనం అయింది. వాటిపై పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చేవి. వీటికి సంబంధించినవారిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. కానీ ఇప్పుడు ఎవరు ఎన్నివేల కోట్లు ఎగవేస్తే అంత గొప్పవారన్న భావన ప్రబలుతున్నట్లుగా ఉంది. అలాంటివారి వార్తలను, సీబీఐ అధికారికంగా ప్రకటించినా ప్రచారం చేయని మీడియాను ఇప్పుడు చూస్తున్నాం. వారు తాము మద్దతు ఇచ్చే పార్టీ కనుక, లేదా తమ సామాజికవర్గం కనుక ఎన్నివేల కోట్లు బ్యాంకులకు ఎగవేసినా, మోసాలు చేసినా వాటిని కప్పిపుచ్చుతాం అన్న చందంగా వ్యవహరించడం వికృత పరిణామం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కొన్నేళ్ల క్రితం, కాంగ్రెస్‌తో రాజకీయంగా విభేదించారన్న ఏకైక కారణంపై తప్పుడు కేసులు పెట్టిన విషయం తెలిసిందే. కొందరు పెట్టుబడిదారులతో కలిసి ఆయన నెలకొల్పిన పరిశ్రమలను అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించారు. మూడు రోజులలో బెయిల్ రావాల్సిన కేసుల్లో న్యాయస్థానాలు పదహారు నెలలు జైలులో ఉంచాయి. అదంతా కాంగ్రెస్, టీడీపీ కలిసి చేసిన కుట్ర అని ప్రజలు భావించారు. అందుకే ఆ తర్వాతి కాలంలో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. ఇది ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే మన దేశంలో రాజకీయాల ఆధా రంగా మోసం కేసులు, అవినీతి కేసుల్లో దర్యాప్తు జరుగుతోందనీ, కోర్టులు కూడా అదే మాదిరి వ్యవహరిస్తు న్నాయనీ విమర్శలు ఎదు ర్కొంటున్నాయి. ఎక్కడైనా పరిశ్రమలు పెట్టినవారికి ప్రోత్సాహకాలు ఇస్తారు. కానీ మన దేశంలో మాత్రం అలా పరిశ్రమలు పెట్టినవారు కేంద్రంలో అధికారంలో ఉన్నవారికి వ్యతిరేకంగా మారితే ఇంతే సంగతి అన్నమాట! అదే కేంద్రంలోని నేతలతో సత్సంబంధాలు, న్యాయ వ్యవస్థలో పలుకుబడి ఉంటే వీడియో సాక్ష్యంగా అవినీతి బయటపడినా వారి జోలికి వెళ్లరు. బ్యాంకులకు డబ్బు ఎగవేసినవారిని గొప్పగా కీర్తించే పరిస్థితి కూడా వస్తున్నదంటే మన సమాజం ఎటువైపు పోతోందో ఆలోచించు కోవచ్చు. పరిశ్రమలు పెట్టేవారిని కాకుండా పరిశ్రమల పేరుతో, కాంట్రాక్టుల పేరుతో మోసం చేస్తున్నవారిని పట్టుకోవాలి. ఈ పరిస్థితి మారకపోతే ఇలాంటి మోసగాళ్లదే పైచేయి అవుతుంది. రాజకీయా లకు, ప్రభుత్వాలకు సంబంధం లేకుండా రుణ వ్యవస్థ, పరిశ్రమల వ్యవస్థ నడిస్తేనే దేశం ముందుకు వెళుతుంది. ఆ పరిస్థితి మార్చడానికి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చిత్తశుద్ధితో కృషి చేయాలి. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
బ్యాంక్ డీఫాల్టర్లపై సీబీఐ కొరడా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కుంభకోణాలు, మోసాలకు సంబంధించి సీబీఐ మంగళవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. బ్యాంకు రుణ ఎగవేతదారులు లక్ష్యంగా మొత్తం 12 రాష్ట్రాల్లో సీబీఐ మెరుపు దాడులు నిర్వహించింది. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా బ్యాంక్ డీఫాల్టర్లపై 14 కేసులను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న వివిధ కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్లపై సమన్వయంతో ఏకకాలంలో 18 వేర్వేరు నగరాల్లో 50 చోట్ల ఏజెన్సీ బృందాలు సోదాలు నిర్వహించినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.14,356 కోట్ల కుంభకోణం తర్వాత సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు బ్యాంకింగ్ సంస్థలపై నిఘా వేశాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరాల ప్రకారం, 2018-19లో రూ. 71,500 కోట్లకు సంబంధించి 6,800కుపైగా కేసులు నమోదయ్యాయి. -
ద్రవ్యోల్బణం డేటాను ఆధునీకరించాలి
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం గణాంకాల కోసం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని సత్వరమే ఆధునీకరించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ ఎంపీసీ సభ్యుడు రవీంద్ర ధోలకియా అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ మూడు రోజుల పాలసీ భేటీ సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ద్రవ్యోల్బణం డేటాపై ధోలకియా ప్రశ్నలు లేవనెత్తారు. ద్రవ్యోల్బణం లెక్కింపునకు సరైన విధానం లేకుండా... ద్రవ్యోల్బణాన్ని లకి‡్ష్యత పరిధిలోనే ఉంచాలన్న కార్యాచరణను ఆర్బీఐ అనుసరించడాన్ని ప్రశ్నించారు. ఫిక్స్డ్ బేస్ వెయిట్ ఇండెక్స్ అన్నది ద్రవ్యోల్బణం లెక్కింపునకు ఉత్తమ విధానం కాదని... చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఏటా ఇండెక్స్ బేస్‌ను మారుస్తున్నారని తెలియజేశారు. ద్రవ్యోల్బణం నియంత్రిత విధానాన్ని అనుసరించేటప్పుడు... కచ్చితమైన, వాస్తవిక లెక్కింపు విధానాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఆర్బీఐ ఎంపీసీ కమిటీలో స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తీకరించే సభ్యుడిగా ధోలకియాకు పేరుంది. ఆగస్ట్‌లో జరిగిన పాలసీ భేటీలో రెపో రేటును పావుశాతం పెంచగా, నాడు ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ధోలకియా ఓటు వేయడం గమనార్హం. నేడే ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయాలు ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలు బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వెల్లడి కానున్నాయి. దేశ జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్ త్రైమాసికంలో 7.1 శాతానికి క్షీణించడం, అదే సమయంలో ద్రవ్యోల్బణం 3.31 శాతం కనిష్టానికి చేరడం వంటి అంశాల నేపథ్యంలో ఆర్బీఐ ఈ విడత కూడా తటస్థ విధానాన్నే అనుసరించొచ్చన్నది విశ్లేషకుల అంచనాగా ఉంది. వచ్చే మార్చి నాటికి ద్రవ్యోల్బణం 3.9–4.5 శాతం స్థాయిలో ఉండొచ్చన్న అంచనాను ఆర్బీఐ గతంలో ప్రకటించింది. అలాగే, 2018–19 వృద్ధి రేటు 7.4–7.5 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ఈ అంచనాలను తగ్గించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ నుంచి వ్యవస్థలోకి రూ.10,000 కోట్లు కాగా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం ద్వారా ఈ నెల 6న వ్యవస్థలోకి రూ.10,000 కోట్ల నిధుల్ని తీసుకొచ్చి, లభ్యతను పెంచనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. -
బ్యాంకు రుణం ఎగ్గొట్టారా.. అయితే ఇక అంతే!
బ్యాంకులకు వేల కోట్లలో బాకీలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా అయితే హాయిగా తట్టాబుట్టా సర్దుకుని లండన్ చెక్కేశారు. అదే చైనాలో అయితే మాత్రం ఆయనకు అలా కుదిరేది కాదు. ఎందుకంటే.. బ్యాంకులలో అప్పు తీసుకుని ఎగ్గొట్టిన దాదాపు 60 లక్షల మంది విమానాలు ఎక్కి ఎక్కడకూ వెళ్లకూడదని, వాళ్లకు రుణాలు, క్రెడిట్ కార్డులు ఇవ్వకూడదని.. చివరకు ఉద్యోగాల్లో ప్రమోషన్లు కూడా ఇవ్వకూడదని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. చైనా సుప్రీంకోర్టు ఇలా బ్లాక్‌లిస్టు చేసిన వారిలో దాదాపు 67.3 లక్షల మంది పౌరులున్నారు. ఇప్పటివరకు 61.5 లక్షల మందిని విమాన టికెట్లు కొనకుండా నిషేధించగా, అలాగే 22 లక్షల మంది హైస్పీడ్ రైళ్లలో కూడా వెళ్లడానికి వీల్లేదని ఆదేశించారు. 71 వేల మంది అయితే కార్పొరేట్ ప్రతినిధులుగా గానీ, ఎగ్జిక్యూటివ్‌లుగా గానీ పనిచేయడానికి కుదరదు. అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ల ఐడీ కార్డు. పాస్‌పోర్టుల సమాచారాన్ని విమానయాన సంస్థలు, రైల్వే కంపెనీలకు చైనా సుప్రీంకోర్టు అందజేసింది. చైనాలోని అతిపెద్ద వాణిజ్య బ్యాంకులలో ఒకటైన ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా దాదాపు లక్ష వరకు అప్పులు, క్రెడిట్ కార్డుల దరఖాస్తులను తిరస్కరించింది. వీళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, రాజకీయ సలహా కమిటీల సబ్యులు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సభ్యులు కూడా ఉన్నారు.