కిరణ్‌ బేడీ రబ్బర్‌ స్టాంప్‌ కాదా?

కిరణ్‌ బేడీ రబ్బర్‌ స్టాంప్‌ కాదా?


న్యూఢిల్లీ: పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి, ఆయన మంత్రివర్గ సభ్యులపై రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ సోమవారం అవినీతి ఆరోపణలు చేస్తూ చిందులు వేయడం సోషల్‌ మీడియాలో రోజంతా హల్‌చల్‌ చేసింది. తాను రబ్బర్‌ స్టాంప్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా ఉండదల్చుకోలేదని, సమర్థురాలైన పాలనాధికారిగా ఉండాలనుకుంటున్నానని కూడా నొక్కి చెప్పారు. ఉన్నతాధికారులంతా తనకే రిపోర్ట్‌ చేయాలని, తన ఆదేశాలకే కట్టుబడి పనిచేయాలని కూడా ఆమె ఇదివరకే ఆదేశించారు.



కిరణ్‌  బేడీ నిజంగా సమర్థరాలైన పాలనాధికారే అయినట్లయితే దేశ ప్రజస్వామ్య వ్యవస్థ గురించి, సమాఖ్య స్ఫూర్తి గురించి సరైన అవగాహన ఉండి ఉండాలి. నారాయణ స్వామి, ఆయన మంత్రివర్గ సభ్యులు, శాసన సభ్యులు అందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనవారు. ముఖ్యమంత్రి మాటను కూడా ఖాతరు చేయకుండా కిరణ్‌ బేడీ ఏకపక్షంగా వ్యవహరించడం ఏ ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తున్నట్లు? పుదుచ్చేరి ప్రైవేటు వైద్య కళాశాల సీట్ల యాజమాన్య కోటా సీట్ల భర్తీ విషయంలో అవినీతి జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. అందులో జోక్యం చేసుకునే అధికారం లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు ఉండదు. సీట్ల భర్తీలో అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు అందితే తనకున్న అధికారాల మేరకు దర్యాప్తు జరిపించి అవినీతిపరులపైన చర్యలు తీసుకోవచ్చు. తానే 26 మంది విద్యార్థుల జాబితాను కళాశాల అధికారులకు ఇచ్చి వారందరికీ సీట్లు ఇమ్మని హుకుం జారీ చేసే అధికారం ఆమెకు ఎక్కడిది? అది అవినీతి, ఆశ్రితపక్షపాతం కిందకు రాదా? అవినీతి ఆరోపణలను నిరూపించినట్లయితే అందుకు ఏ శిక్షకైనా తాను సిద్ధమేనని ముఖ్యమంత్రి సవాల్‌ చేస్తున్నప్పుడు చట్ట ప్రకారం చర్యలకు సిద్ధం కావచ్చుగదా!



కిరణ్‌ బేడీ రాష్ట్ర ప్రభుత్వ విధుల్లో జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. అధికారులు ‘వాట్సాప్‌’ గ్రూపును ఉపయోగించడాన్ని ముఖ్యమంత్రి గత జనవరిలో నిషేధించినప్పుడు జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయాన్ని తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్‌ పరిధాపై చర్యకు ఏప్రిల్‌ నెలలో ఆదేశించారు. అసెంబ్లీ స్పీకర్‌ వైథిలింగం ఆదేశాలపై పుదుచ్ఛేరి మున్సిపల్‌ కమిషనర్‌ను తొలగించిందుకు చీఫ్‌ సెక్రటరీపై మండిపడ్డారు.



ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పుదుచ్చేరి ప్రభుత్వంపై లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ పెత్తనం చెలాయించడమంటే కేంద్రం పెత్తనం సాగించడమే. నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ రాష్ట్రాల పట్ల కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించాలని అనేవారు. బీజేపీ కూడా రాష్ట్రాలపై కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ సమాఖ్య స్ఫూర్తిని మంటగలుపుతోందని తరచూ విమర్శించేది. ప్రధాన మంత్రయ్యాక నరేంద్ర మోదీ అప్పుడప్పుడు సమాఖ్య స్ఫూర్తి అంటున్నారుగానీ, బీజేపీ ఒక్కసారి కూడా సమాఖ్య స్ఫూర్తి గురించి మాట్లాడటం లేదు. కేంద్రం కనుసన్నల్లో నడుచుకునే గవర్నర్లు రబ్బరు స్టాంపులుకాకుండా మరేమిటో!    

        

-ఓ సెక్యులరిస్ట్‌ కామెంట్‌

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top