జనగణనకు అధికారగణం సన్నాహాలు


65,522 మంది ఎన్యూమరేటర్లు.. రూ.5.97 కోట్ల ఖర్చు

 


హైదరాబాద్: వచ్చే నెలలో చేపట్టే జాతీయ జనాభా లెక్కలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. గతంలో జనగణన చేపట్టిన తరహాలోనే ఇంటింటి సర్వే నిర్వహించనుంది. జాతీయ జనాభా గణనను అప్‌డేట్ చేయటంతోపాటు ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నందున ఈ సర్వేను సమర్థవంతంగా చేపట్టాలని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సర్వే మార్గదర్శకాలను వివరించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే ఎన్యూమరేటర్లుగా ఎంపిక చేయాలని, ప్రైవేటు ఉద్యోగులను తీసుకోవద్దని ఆదేశించారు. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15లోగా సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  75,776 ఎన్యూమరేషన్ బ్లాకులను గుర్తించి ంది. మొత్తం 65,522 మంది ఎన్యూమరేటర్లను ఈ సర్వేకు వినియోగించనుంది. సర్వే నిర్వహణకు పది జిల్లాల పరిధిలో మొత్తం రూ.5.97 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. పంట కోత ప్రయోగాలు: కరువు మండలాలను ప్రకటించేందుకు ప్రతి మండలంలో పంట కోత ప్రయోగాలను సక్రమంగా నిర్వహించాలని ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లకు బీపీ ఆచార్య సూచించారు. జిల్లాకు 30 ఫిల్మ్‌లు: నవంబర్ 14 నుంచి 20 వరకు అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని బీపీ ఆచార్య కలెక్టర్లను కోరారు. ప్రతి జిల్లాకు 30 ఫిల్మ్‌లు పంపిస్తున్నామని, వీటిని జిల్లా కేంద్రంలో ఉచితం గా ప్రదర్శించే ఏర్పాట్లు చేయాలన్నారు.

 

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top