మరో రూ.7,500 కోట్లు: జర్మనీ

మరో రూ.7,500 కోట్లు: జర్మనీ - Sakshi


బెర్లిన్/ఎథెన్స్: సిరియా తదితర దేశాల నుంచి వెల్లువలా వస్తున్న శరణార్థులకు తమ దేశంలో ఆశ్రయం, వసతులు కల్పించటం కోసం వచ్చే ఏడాది అదనంగా మరో 600 కోట్ల యూరోలు (రూ. 7,500 కోట్లు) కేటాయిస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. గత ఏడాది రెండు లక్షల మంది శరణార్థుల నుంచి దరఖాస్తులు అందగా.. ఈ ఏడాది 8 లక్షల దరఖాస్తులు వస్తాయని జర్మనీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ సోమవారం  మీడియాతో మాట్లాడుతూ..



సిరియాలో, ఇతర ప్రాంతాల్లో యుద్ధాల వల్ల ఆయా దేశాల నుంచి వలస వస్తున్న శరణార్థులకు జర్మన్లు రైల్వేస్టేషన్లలో కానుకలతో స్వాగతం పలకడం  మనసు కదిలించే అంశమని అభివర్ణించారు. లక్షల సంఖ్యలో వస్తున్న శరణార్థుల సవాలును తమ పటిష్ట ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కోగలదని అన్నారు. తాజా పరిణామాలు జర్మనీని మార్చివేయనున్నాయని, అది సానుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.  

 

తాజా శరణార్థుల కోటా రూపకల్పన...

శరణార్థుల విషయంలో ఫ్రాన్స్ మరింత భాగం తీసుకుంటుందని ఆ దేశాధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో 24 వేల మందికి ఆశ్రయం కల్పిస్తామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో తమ దేశంలో 750 మంది సిరియా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తామని న్యూజిలాండ్ ప్రకటించింది.  ఫ్రాన్స్, జర్మనీల ఒత్తిడి నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ వివిధ దేశాలకు తాజా కోటాలను సిద్ధం చేస్తోంది. బుధవారం ప్రకటించనున్న ఈ కోటా ప్రకారం.. 1,20,000 మంది శరణార్థుల్లో సగం మందిని వివిధ ఈయూ దేశాలకు తరలించనున్నారు.



యూరప్ తీరంలోని గ్రీస్, ఇటలీ, హంగరీలపై శరణార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు జర్మనీ 31,443 మందిని, ఫ్రాన్స్ 24,031 మందిని, స్పెయిన్ 14,931 మందిని తీసుకోనున్నాయని ఈయూ వర్గాలు తెలిపాయి. హంగరీకి చేరుకున్న వేలాది మంది శరణార్థుల కోసం.. ఆస్ట్రియా, జర్మనీలు తమ సరిహద్దులను తెరచివుంచటంతో పాటు ప్రయాణ ఆంక్షలను సడలించటంతో శుక్రవారం నుంచి ఈ రెండు దేశాలకు వలసల సంఖ్య పెరిగింది. గత రెండు రోజుల్లో 20 వేల మంది జర్మనీకి చేరుకోగా సోమవారం మరో పది వేల మంది వస్తారని అంచనా. బాల్కన్ ప్రాంతాల నుంచి భూమార్గంలో తమ దేశానికి చేరుకున్న శరణార్థులను హంగరీ శుక్రవారం నాడు బస్‌ల ద్వారా ఆస్ట్రియా సరిహద్దుకు చేర్చటంతో ఈ 20,000 మంది శరణార్థులు అక్కడి నుంచి జర్మనీ వచ్చారు.   

 

శరణార్థులను రక్షించిన ప్రయాణికులు

మరోవైపు.. టర్కీ, బాల్కన్ ప్రాంతాల నుంచి భూమార్గంలోనూ, మధ్యధరాసముద్ర మార్గంలో కిక్కిరిసిన బోట్లలోనూ యూరప్ తీర దేశాలకు శరణార్థులు చేరుకుంటూనే ఉన్నారు. గ్రీస్ తీరంలో లెస్‌బోస్ దీవి వద్ద సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్న 61 మంది శరణార్థులను గ్రీస్‌కు చెందిన ఒక ప్రయాణ బోటు రక్షించింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top