ఆ 27 జీవితాలను అడిగితే తెలుస్తుంది..


'' పోయిన ప్రాణాలను ఎలాగు వెనక్కి తీసుకు రాలేము. ప్రభుత్వం ఇచ్చిన రూ 10 లక్షల నష్టపరిహారంతో ఏదైనా ఉపాధి ఏర్పాటు చేసుకో..జాగ్రత్తగా ఉండు..'' పుష్కర మృతుల అంత్యక్రియల్లో పాల్గొంటూ ప్రభుత్వ అధికారులు వల్లె వేస్తున్న మాటలు. గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి, మంత్రులు దగ్గర నుండి గ్రామస్థాయి నాయకులు( అధికార పార్టీ), ప్రభుత్వ ఉద్యోగుల వరకు జపిస్తున్నమాటలు. ఒక రకంగా ఎక్కువగా ఏమీ మాట్లాడకండి. పది లక్షలు తీసుకుని నోరు మూసుకోండి అని చెప్పకనే చెబుతున్నారు. దగ్గరుండి మరీ అంత్యక్రియలు నిర్వహించి సాగనంపుతున్నారు. ఎక్కడా నిరసన ధ్వనులు వినకుండా జాగ్రత్త పడుతున్నారు.




సంఘటన జరిగి 48 గంటలు గడవకముందే ఇదేదో విషయం కానట్టు వ్యవహరిస్తున్నారు. అసలు ఏమీ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. ' ఇదో చిన్న సంఘటన' అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెలవిస్తే.. ఇక ఆ తర్వాతి స్థాయి నాయకులు ఊరుకుంటారా..రెచ్చిపోరు..చిన్నసంఘటన, విచారం.. భావోద్వేగం ఎవరికీ కనిపించక పోయినా వారికి మాత్రమే కనిపించిన కంటతడి.. ఇలా విషయాన్ని మెల్లిగా పక్కదారి పట్టించి, దారి తప్పించి  ఏ శంకరగిరి మాన్యాలుకో పంపించే ప్రయత్నాలు గట్టిగానే మొదలయ్యాయి. కొందరు అధికారులను బలిపశువులను చేసేందుకు రంగం సిద్ధమైంది.



ప్రతీ చిన్న విషయానికి పెద్దగొంతుక చేసుకునే 'మైకాసురులు' అకస్మాత్తుగా మాయమయ్యారు. 'ఇంత దుస్సాహసమా..అంతు చూస్తామనే' మేధావులు ఎందుకో కనుమరుగయ్యారు. ఎప్పుడు ఏర్పాటయిందో తెలియదు కాని ''ట్విట్టర్ బాబు'' పేరుమీద ఒక ట్రస్ట్ అట.. ఆ టీషర్ట్స్ వేసుకుని కొందరి హడావిడి.. పేరు పొందాలని ఆరాటపడ్డ ట్విట్టర్ బాబు వ్యూహాత్మక మౌనం.. ప్రశ్నించేందుకే పుట్టిన వారు ఒక సంతాప సందేశమిచ్చి '' సెలెక్టివ్ మౌన ముద్ర'' ని ఉత్తమ మార్గంగా ఎంచుకున్నారు.



అసలు అడగటానికి ప్రశ్నలే లేవా? అడగాల్సిన సమయం కాదా.. అడిగితే మరొక తొక్కిసలాట జరుగుతుందా..అడిగితే పెద్దలకు కోపం వస్తుందని భయమా.. కాని ప్రశ్నించాల్సిన వ్యక్తులు, వ్యవస్థలు ప్రశ్నించవు. ఒక వైపు మరణమృదంగం వినపడుతుంటే 'నిజాన్ని నిర్భయంగా' చేప్పేవారు అంతా బాగుందని చూపించే, వినిపించే ప్రయత్నం నిర్విరామంగా చేశారు. ''దమ్ము'', ''ధైర్యం''.. గోదార్లో కలిసిపోయాయో తెలియదు కాని విషయాన్ని పక్కదారి పట్టించాలన్న వారి తెగువ చూసి సామాజిక వెబ్ సైట్లలో ' ఇక మీరు మూసుకోండి' అన్న కామెంట్లు మాత్రం తలెత్తాయి.



సంఘటనకి మూలాలు వెతకాల్సింది పోయి..అసలు సంఘటనే జరగలేదన్నట్టుగా వ్యవహరించడం..ఆ తెంపరితనం.. మౌనం.. ఆ నిర్లక్ష్యం.. ప్రాణాలకు 10 లక్షల రూపాయలు వెలకట్టి ఉపాధి చూసుకోండని చెప్పే ఆ తెగువ ..రెండోరోజు అంతా బాగుందని చెప్పే ప్రయత్నం.. ఆశ్చర్యపోవాలో..సిగ్గుతో తలవంచుకోవాలో తెలియడం లేదని సోషల్ వైబ్ సైట్లలో కనిపిస్తుంటే పాలకుల చర్మ దళసరి తనం కొలవడానికి వేరే పరికరాలు అవసరం లేదనిపిస్తోంది.


ఇది చిన్న సంఘటన అని ముఖ్యమంత్రి ప్రకటించడం..ఇదే ప్రశ్న..ఈ ఫొటోలో ఉన్నఇద్దరు చిన్నారులను ప్రశ్నించండి.

చిన్నారుల కళ్లల్లోకి నేరుగా చూసి ఇది చిన్న సంఘటన అని చెప్పగలిగే ధైర్యం పాలకులకు ఉందా.. పదిలక్షల రూపాయలలో మీ భవిష్యత్తును నిర్మించుకోండి అని చెప్పే సాహసం చేయగలరా.. నిర్విరామ జలపాతాలుగా మారిన ఆ కన్నీటికి విలువ కట్టగలరా.. నిజమే పోయిన ప్రాణాలను తెచ్చి ఎవరూ ఇవ్వలేరు.. ఆ ప్రాణాలు కోల్పోవడానికి కారణాలు ఏమిటి? తప్పు ఎవరిది? దోషులెవరు? శిక్షలు ఎప్పుడు.. వీటికి జవాబులు ఉండవా.. కనీసం ఆ దిశలో ప్రయత్నం జరగదా..



సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత రోడ్డుపై చిందిన రక్తంపై పోలీసులు పక్కనుంచి మట్టిని తీసుకొచ్చి చల్లుతారు. కొద్ది నిమిషాల్లో ఆ మట్టి..దాంతో పాటు చిందిన రక్తం వాహనాల టైర్ల కింద పడి మాయమవుతుంది. రోడ్డు మళ్లీ ఎప్పటిలాగే..మామూలుగా..వాహనాలు  ఏమీ జరగనట్టుగా గాలితో పోటీపడుతుంటాయి. గంటల్లో సంఘటన పాతపడిపోతుంది. చిన్న సంఘటనగా మిగిలిపోతుంది..చనిపోయిన వ్యక్తి కుటుంబానికి మాత్రం అది జీవితాంతం వెంటాడే..వేటాడే చేదు జ్ఞాపకం.



నిజంగానే ఇది చిన్నసంఘటనా?.. ఆ 27 జీవితాలను అడిగితే తెలుస్తుంది.



ఎస్. గోపీనాథ్ రెడ్డి

డిప్యూటీ ఎడిటర్

(ఇంటర్నెట్ డెస్క్)

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top