పీఠం కోసం పోటీ..

Youth Fight For Panchayat Elections In Telangana - Sakshi

సర్పంచ్‌ అభ్యర్థి కోసం యువత పోటీ

పార్టీల నాయకుల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణ లు

గ్రామాల్లో ఊపందుకున్న రాజకీయ వేడి

రోజురోజుకూ మారుతున్న పరిణామాలు

దమ్మపేట: తెలంగాణలో గ్రామ సర్పంచుల పీఠం కోసం ఎవరికి వారు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులు రాజకీయ పార్టీల అగ్ర నాయకుల వద్ద అన్నా నేను పోటీ చేస్తాను.. నాపేరు పరిశీలించండి అంటూ వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రధానంగా ద్వితీయ శ్రేణి నాయకులు ఈ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందడానికి పావులు కదుపుతున్నారు.

ఊపందుకున్న రాజకీయ వేడి..
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల వేడి ప్రారంభమైంది. అధికారులు గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసి విడుదల చేయగా ఎన్నికల సంఘం నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుండటంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఒక్కో గ్రామంలో ప్రతి పార్టీ నుంచి ఇద్దరు నుంచి నలుగురు అభ్యర్థులు బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. పోటీ తీవ్రమవుతున్న దృష్ట్యా ఆయా గ్రామాల్లోని ఆశావహులు అగ్రనాయకుల మద్దతు కోసం వారి చుట్టూ తిరుగుతున్నారు. గ్రామీణ ప్రాంత కార్యకర్తలు రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే సర్పంచి పదవే కీలకం. అధికారం వస్తే అధికార, ప్రతిపక్ష పార్టీల అగ్ర నేతలు, అధికారులతో పరిచయం ఏర్పడి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి సులువవుతుందని ఆశావహులు ఆలోచన చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని రాజకీయ పదవులు చేపట్టడానికి సర్పంచ్‌ పదవితోనే గుర్తింపు వస్తుందన్న ఉద్దేశంతో పోరుకు సిద్ధమవుతున్నారు. పోటీలో గిరిజన నాయకులతో పాటు, కార్యకర్తలు ఉత్సాహం చూపుతున్నారు. ఇటీవల నిర్వహించిన శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం గ్రామాల్లోని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా పనిచేశారు. బహిరంగ సభలు, సమావేశాలకు జనాలను తరలలించడం, ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేయడంలో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కీలంగా వ్యవహరించారు. ఇదిలా ఉం డగా సర్పంచ్‌ ఎన్నికలను పార్టీ గుర్తులపై కాకుం డా స్వతంత్ర గుర్తులతో నిర్వహిస్తుండటంతో అభ్యర్థులకు ప్రధాన పార్టీల మద్దతు తప్పనిసరి అని భావిస్తున్నారు.

వేగంగా ఎన్నికల ఏర్పాట్లు..
పంచాయతీ ఎన్నికలను నిర్విహించడానికి అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సర్పంచుల, వార్డు సభ్యుల రిజర్వేషన్లను విడుదల చేశారు. నియోజకవర్గంలో మొదటి విడతలో ములకలపల్లి మండలంలోని 20 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రెండో విడత జనవరి 25న అశ్వారావుపేట, దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ మండల్లాని 85 పంచాయతీల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. మొదటి విడత పోలింగ్‌కు సంబంధించి పోలింగ్‌ కేంద్రాలను గుర్తించడంతో పాటు స్టేజ్‌–1, స్టేజ్‌–2 అధికారులకు శిక్షణ ఇచ్చారు.

గ్రామాల్లో అంతర్గత ప్రచారం..
సర్పంచ్‌ పీఠం కోసం పోటీ పడుతున్న ఆశావహులు ఇప్పటికే గ్రామాల్లో అంతర్గత ప్రచారం ప్రారంభించారు.S బరిలో నిలిచే అభ్యర్థులు కులాల వారీగా ఓటర్లను బేరీజూ వేసుకుంటూ యూత్‌ సంఘాలతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో తనకే మద్దతు ఇవ్వాలని ఎవరికి వారు పోటీ పడుతున్నారు. ఇందుకు గాను ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వారి స్థాయి పనులు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈక్రమంలో మందు బాబులు అందినంత మధ్యం సేవిస్తుండటంతో గ్రామాల్లో మద్యం ఏరులైపారుతోంందన్న అనుమానాలు పలువురు నుంచి వ్యక్తం అవుతున్నాయి.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top