పెళ్లికి నిరాకరించాడని..

young woman committed suicide as marriage rejects

యువతి బలవన్మరణం

తొలుత ఇష్టపడిన వరుడు

రోజూ ఫోన్‌లో మాట్లాడి..   మాట మార్చిన వైనం

సాక్షి నిజామాబాద్ : వివాహం నిశ్చయం చేసుకొని, రోజూ ఫోన్‌లో మాట్లాడిన యువకుడు.. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బాల్కొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై స్వామిగౌడ్‌ కథనం ప్రకారం.. బాల్కొండకు చెందిన తోట నవత (23) స్థానిక ఉర్దూ మీడయం ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఆమెకు, వేల్పూర్‌ మండలం పచ్చల నడ్కుడకు చెందిన రజనీకాంత్‌తో నెల క్రితం వివాహం నిశ్చయమైంది. పెళ్లి ముహూర్తం దూరంగా ఉండడంతో రజనీకాంత్‌ దుబాయి వెళ్లాడు. ఇద్దరు రోజూ ఫోన్‌లో మాట్లాడుకునే వారు. అయితే, నాలుగు రోజుల నుంచి రజనీకాంత్‌ ఫోన్‌ చేయడం లేదు. ఆదివారం వరుడి తరఫు బంధువులు నవత ఇంటికి వచ్చి ఈ పెళ్లి చేసుకోవడం రజనీకాంత్‌కు ఇష్టం లేదని, సంబంధం రద్దు చేసుకుందామని ఆమె తల్లిదండ్రులకు తెలిపారు.

దీంతో తీవ్ర మనస్థాపం చెందిన నవత ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులతో పాటు అదే గల్లీలో ఉండే అమ్మమ్మ తదితరులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. అయితే, అమ్మమ్మ తమ ఇంటికే వెళ్లిందని గుర్తించిన నవత ఆమె ఇంట్లోకి వెళ్లి తాడుతో ఉరేసుకుంది. రాత్రి 10 గంటల సమయంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లి చూడగా దూలానికి వేలాడుతూ కనిపించింది. ఆమె కేకలు వేయడంతో విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కట్నం కోసమేనా..?
నవతతో పెళ్లి రద్దు చేసుకోవడానికి కారణం అదనపు కట్నమే కారణమని తెలిసింది. బాల్కొండ మండలంలోని మరో గ్రామానికి  చెందిన యువతి వాళ్లు ఎక్కువగా కట్నం ఇస్తారనడంతోనే ఈ సంబంధాన్ని వద్దన్నారని సమాచారం. పెళ్లి కుదిరిన సమయంలో నవత తల్లిదండ్రులు కట్నం కింద తొలి విడతలో రూ.లక్ష ముట్టజెప్పినట్లు స్థానికులు తెలిపారు. అయితే, అదనపు కట్నంపై ఆశతోనే పెళ్లిని రద్దు చేసుకున్నారని, దీంతో మనస్థాపానికి గురైన నవత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top