పౌర పోలీసులు

Young Mens Catched Chain Snatchers in Hyderabad - Sakshi

స్నాచర్లను వెంటాడి పట్టుకున్న యువకులు

బాధ్యతగా భావించి స్పందించిన ముగ్గురు

సీపీ అంజనీకుమార్‌ సన్మానం

సాక్షి, సిటీబ్యూరో: ‘ప్రతి పోలీసు యూనిఫాంలో ఉన్న పౌరుడు... ప్రతి పౌరుడు యూనిఫాంలో లేని పోలీసు’... ఈ అంతర్జాతీయ నానుడిని నిజం చేశారు ఆ ముగ్గురు. బుధవారం రాత్రి తార్నాక ప్రాంతంలో తమ కళ్ల ఎదుట జరిగిన సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌పై తక్షణం స్పందించి బైక్‌పై పారిపోతున్న స్నాచర్లను వెంటాడి పట్టుకున్నారు. వీరి స్ఫూర్తిని గుర్తించిన సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ గురువారం వారిని సన్మానించారు. బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఈస్ట్, నార్త్‌ జోన్స్‌ డీసీపీలు ఎం.రమేష్, కల్మేశ్వర్‌ సింగెనవర్‌ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ముగ్గురు యువకులకూ జ్ఞాపికలు అందజేశారు.  

వరుస స్నాచింగ్‌లతో హడలెత్తిస్తూ..
నగరానికి చెందిన ఇద్దరు మైనర్లు గతంలోనూ కొన్ని నేరాలు చేశారు. తాజాగా బైక్‌పై తిరుగుతూ రెండు కమిషనరేట్ల పరిధిలో ఆరు చోట్ల పంజా విసిరారు. రాచకొండలోని మల్కాజ్‌గిరిలో బ్యాగ్, నగరంలోని లాలాగూడ, నల్లకుంట, ఉస్మానియా వర్శిటీ పరిధుల్లో సెల్‌ఫోన్లు లాక్కుపోయారు. ఓయూ పరిసరాల్లో మూడు సెల్‌ఫోన్లు ఎత్తుకుపోయారు. నల్లకుంటలో సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్న బాధితుడు తక్షణం స్పందించి ‘100’కు సమాచారం అందించడంతో అప్రమత్తమైన పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు.  

వెంటాడి పట్టుకుని...
తార్నాక ప్రాంతంలో ఓ వ్యక్తిని వీరు టార్గెట్‌గా చేసుకున్నారు. అందులో ఒకరు వాహనాన్ని స్టార్‌ చేసే ఉంచి సిద్ధంగా ఉండగా, మరొకరు సదరు వ్యక్తి వద్దకు వెళ్లి తన తల్లితో మాట్లాడాలంటూ ఫోన్‌ అడిగి తీసుకున్నాడు. అదే అదనుగా భావించి ఫోన్‌తో సహా తన ‘సహచరుడి’తో కలిసి వాహనంపై మెట్టుగూడ వైపు ఉడాయించారు. దీనిని గుర్తించిన బాధితుడు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న యువకులు ధీరజ్‌కుమార్, శ్రీకాంత్, బీవీ ప్రమోద్‌ అప్రమత్తమై బైక్‌పై వారిని వెంబడించారు. 80 నుంచి 90 కిమీ వేగంతో దూసుకుపోతున్న వారు కొద్దిసేపటికి మెట్టుగూడ ప్రాంతంలో కనుమరుగయ్యారు.

ఆటోలో నక్కి ఉండగా...
ఈ స్నాచర్లు తమ వాహనానికి ఉన్న సైలెన్సర్‌ను పీకేశారు. రాత్రి వేళ విపరీతమైన శబ్ధంతో దూసుకుపోతున్న ఆ వాహనాన్ని గమనించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పటికే స్నాచర్లు దాక్కున్న ప్రదేశానికి చేరుకున్న ముగ్గురు యువకులూ వారి కోసం గాలించగా, ఓ గల్లీ వద్ద ఆగి ఉన్న బైక్‌ను గుర్తించారు. ఆ సమీపంలోనే ఆటోలో నక్కిన ఇద్దరినీ పట్టుకున్నారు. వీరి ద్వారా సమాచారం అందుకున్న లాలాగూడ పోలీసులు తక్షణం ఘటనాస్థలికి చేరుకుని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. స్నాచర్లను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురూ రామాంతపూర్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు.  ధీరజ్‌ విద్యార్థి కాగా... మిగిలిన ఇద్దరూ ప్రైవేట్‌ ఉద్యోగులు.  

అయ్యో పాపం అనిపించింది..
తార్నాకలో నేరం జరిగిందని తెలిసిన వెంటనే అప్రమత్తమై స్నాచర్లను వెంటాడాం. మెట్టుగూడలోని స్కైల్యాబ్‌ హోటల్‌ వద్ద ఆటోలో దాక్కున్న ఇద్దరినీ పట్టుకున్నాం. తొలుత వారు తమ వద్ద ఉన్న ఓ బేసిక్‌ ఫోన్‌కు ఇచ్చి తమ వద్ద ఇంకా ఏమీ లేవన్నారు. దాంతో పాటు వారి స్థితి చూడగానే అయ్యో పాపం అనిపించింది. ఆ తర్వాత వారి బైక్‌ను వెతికితే మిగిలిన ఫోన్లు, బ్యాగ్‌ బయటపడ్డాయి. అప్పుడే వీరి నిజస్వరూపం తెలిసింది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తున్న పోలీసుల పని తీరూ మాకు పూర్తిగా అవగతమైంది. పారిపోతున్న నేరగాళ్లను పట్టుకోవడం మా బాధ్యతగా భావించాం. ఇలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది.      – ధీరజ్, శ్రీకాంత్, ప్రమోద్‌

అందరికీ ఆదర్శం
తమ కళ్ల ఎదుట జరిగిన నేరంపై ఈ యువకులు స్పందించిన తీరు అభినందనీయం. ఇదే స్ఫూర్తిని మరికొందరు ఆదర్శంగా తీసుకోవాలి. పోలీసు–ప్రజల మధ్య సంబంధాలకు ఇదో మంచి ఉదాహరణ. ప్రజలు తమకు సహకరిస్తూ ఉంటే కేసులు కొలిక్కి తీసుకురావడమే కాదు... నేరాల నిరోధానికి ఆస్కారం ఏర్పడుతుంది. మీ కళ్ల ముందు ఎలాంటి నేరం జరిగినా, మీ వాళ్లలోవిపరీతమైన మార్పులు గమనించినా తక్షణం స్పందించండి. నేరుగా లేదా 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వండి. నిందితుల నుంచి ఐదు సెల్‌ఫోన్లు, బ్యాగ్‌ స్వాధీనం చేసుకున్నాం.– అంజనీకుమార్, కొత్వాల్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top