
టి.టీడీఎల్పీ నేతగా ఎర్రబెల్లి
రోజుకో మలుపు తిరుగుతూ సాగిన తెలంగాణ టీడీపీ శాసనసభా పక్ష నేత ఎంపిక వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది.
సాక్షి, హైదరాబాద్: రోజుకో మలుపు తిరుగుతూ సాగిన తెలంగాణ టీడీపీ శాసనసభా పక్ష నేత ఎంపిక వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. టీ టీడిఎల్పీ నేతగా ఎర్రబెల్లి దయాకరరావు నియామకం ఖరారైంది. ఉప నేతలుగా తలసాని శ్రీనివాస్ యాదవ్, రేవంత్‌రెడ్డిలను, విప్‌గా సండ్ర వెంకటవీరయ్యను చంద్రబాబు నియమించారు. అయితే ఎప్పట్లాగే ఈ సమాచారాన్ని కూడా శనివారం రాత్రి 10 తరువాత మీడియాకు లీకుగా అందజేశారు. ఆదివారం అధికారికంగా ప్రకటించే అవకాశముంది. తెలంగాణ టీడీపీలో తొలిసారిగా పార్లమెంటరీ పార్టీ తరహా విధానాన్ని అమలు చేయాలని బాబు శుక్రవారం భావించారు.
టీటీడీఎల్పీ చైర్మన్‌గా ఎర్రబెల్లిని, శాసనసభాపక్ష నేతగా తలసాని, ఉప నేతలుగా రేవంత్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్యలను నియమించాలని భావిం చారు. ఆ మేరకు పార్టీ ఎమ్మెల్యేలకు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. కానీ తాను అధికారం చేపట్టబోతున్న ఆంధప్రదేశ్‌లోనూ అదే విధానాన్ని అమలు చేయాల్సి రావచ్చన్న భావనతో శనివారం రాత్రికల్లా ఆ ప్రతిపాదనను బాబు విరమించుకున్నారు. టీడీఎల్పీ నేతగా తనను నియమించనున్నట్టు తొలుత ప్రకటించిన బాబు, తరవాత నిర్ణయాన్ని మార్చుకోవడం పట్ల తలసాని తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. తానెలాంటి పదవులూ తీసుకోబోనని, ఎమ్మెల్యేగానే ఉంటానని చెప్పి బాబు ఇంటి నుంచి వెళ్లిపోయారు.