మహిళల భద్రత మాది

Womens safety is ours says Naini Narsimha reddy - Sakshi

షీటీమ్స్‌ చక్కగా పనిచేస్తున్నాయి 

హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి  

హైదరాబాద్‌: ‘మహిళల భద్రత తెలంగాణ ప్రభుత్వానిది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్‌ శాఖను అభివృద్ధి చేశాం. శాంతిభద్రతలు అదుపులో ఉంటే రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధించనట్లే’ అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని షీటీమ్స్‌ నేతృత్వంలో మహిళల భద్రతలపై అవగాహన కల్పించేందుకు ఇక్కడ నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో రెండు రోజుల ఎక్స్‌పోను ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్‌పోను శనివారం ప్రముఖ నటి రాశీఖన్నా, తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీవీ శ్రీనివాసరావు, అదనపు కమిషనర్‌(నేరాలు) స్వాతిలక్రా తదితర అధికారులతో కలసి నాయిని ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులందరికీ బెంగళూరు రోబో మిత్ర స్వాగతం పలికింది. అనంతరం అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు మిత్ర చెప్పిన సమాధానాలు ఆకట్టుకున్నాయి.  

పోలీస్‌శాఖకు సహకరిస్తాం.. 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలను తు.చ. తప్పకుండా పాటిస్తున్న అధికారి స్వాతిలక్రా అని నాయిని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళల భద్రత దృష్ట్యా షీటీమ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. షీటీమ్స్‌ సుదీర్ఘంగా పనిచేస్తూ అందరి మన్ననలను అందుకుంటున్నాయని చెప్పారు. పోలీస్‌ శాఖ వల్ల తమ ప్రభుత్వానికి మంచి పేరు, ప్రఖ్యాతులు వచ్చాయన్నారు. పోలీస్‌శాఖకు అన్నివిధాలుగా సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. షీటీమ్స్‌పై ప్రజల్లో విస్తృత ప్రచారాన్ని తెచ్చేందుకు ఈవిధమైన ఎక్స్‌పోలను నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశంలోని మెట్రోపాలిటన్‌ సిటీల్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ షీటీమ్స్‌ పనిచేస్తున్నాయని ప్రశంసించారు. నటి రాశీఖన్నా మాట్లాడుతూ.. మహిళలు, యువతులు లైంగిక వేధింపులను దైర్యంగా ఎదుర్కొని షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. షీటీమ్స్‌ ఇంతటి మంచి కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు.

అందరి నుంచి ప్రశంసలు: స్వాతిలక్రా
షీటీమ్స్‌కు అన్ని వర్గాల నుంచి మంచి ప్రశంసలు అందుతున్నాయని షీటీమ్స్‌ ఇన్‌చార్జి స్వాతిలక్రా అన్నారు. మహిళలకు మరింత భరోసా కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 2వేల మందికి పైగా ఆకతాయిలను పట్టుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చామని, కొందరికి శిక్ష విధించామని వివరించారు. ఆఫీసుల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య 4వేలకు మించి ఉందన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top